ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డిపై సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. అవినాష్‌రెడ్డి తమకు ఏమాత్రం సహకరించడం లేదని మరోసారి తేల్చి చెప్పింది. “కేసు దర్యాప్తులో మొదటినుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు” అని సీబీఐ చెప్పింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ వాదనలు విన్నారు. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదు.. అని వివరించారు.
దారుణ హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎంతో మందిని విచారించామన్నారు. కొందరిని అరెస్టు చేశామని, మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్‌కు ఏమిటని అన్నారు. కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారని సీబీఐ తనఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేంటి? అని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. “రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది. అవినాష్ రాజకీయంగా శక్తిమంతుడైతే వివేకాను చంపాల్సిన అవసరం ఏంటి?” అని కోర్టుకు తెలిపారు.
“భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుకు కారణాలేంటని.. వారి నుంచి ఏం తెలుసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. “కుట్రలో ప్రమేయం దృష్ట్యా భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేశాం. కస్టడీ విచారణకు వారిద్దరూ సహకరించడం లేదు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారు. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారు. శత్రువుకి శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారు. అవినాష్ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి చెప్పాడు. అవినాష్ డబ్బులు శివశంకర్‌రెడ్డికి ఇస్తే.. శివశంకర్ రెడ్డి గంగిరెడ్డికి ఇచ్చాడు. రూ.4 కోట్లు ఖర్చు చేయడానికి శివశంకర్‌రెడ్డికి ఏం అవసరం?’’ అని సీబీఐ తెలిపింది.