ఆ తప్పులే.. కోజికోడ్ ప్రమాదానికి కారణం

వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. మరి కాసేపట్లో తమ వాళ్లను కలుసుకోనున్నామన్న ఆనందం.. అప్పటివరకు గాల్లో ఎగురుకుంటూ వచ్చిన విమానం.. నేలను తాకుతున్న క్షణాల్లో విమానంలో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ఎలాంటి అనుమానాలు లేవు.

కాసేపు ఆగితే.. నచ్చిన ఫుడ్ నచ్చినోళ్లు చేతల మీద తినొచ్చన్న ఆలోచనలతో నిండిన వారికి.. అనూహ్యంగా ప్రమాదం చోటు చేసుకోవటం.. కళ్లు మూసి కళ్లు తిరిచేంతలో నేలను తాకిన విమానం జారటం.. అదుపు తప్పి.. గింగిరాలుతిరుగుతూ.. యాభై అడుగులు లోతులోని లోయలోకి పడిపోవటం.. విమానం రెండు ముక్కలు కావటంతో ఏం జరిగిందో అన్న షాక్ నుంచి బయటకు రావటానికే చాలా సమయం పట్టింది.

గాయాలతో.. చావులతో రోదనలు.. హాహాకారాలు మిన్నంటాయి. కోజికోడ్ విమాన ప్రమాద దుర్ఘటన వెనుక అసలు నిజాలేమిటి?అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంలోకి వెళ్లినప్పుడు.. కొత్త విషయాలు తెర మీదకు వస్తాయి. దేశంలోని మూడు ప్రమాదకరమైన టేబుల్ టాప్ ఎయిర్ పోర్టుల్లో కోజికోడ్ ఒకటి. ఇలాంటి ఎయిర్ పోర్టుల్లోకి బోయింగ్ 737విమానాలకు ఏ మాత్రం క్షేమం కాదు. ఈ తరహా విమానాల్ని టేబుల్ టాప్ ఎయిర్ పోర్టులకు పంపటం మానేసి చాలాకాలమే అయ్యింది. అయనప్పటికి ప్రమాదానికి కారణమైన విమానానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అన్నది ప్రశ్న.

అసలే టేబుల్ టాప్ విమానాశ్రయం. దానికి తోడు జోరున వర్షం కురుస్తున్న వేళ.. రన్ వే మొత్తం చిత్తడిగా ఉన్నప్పుడు..బోయింగ్ 737లాంటివి ల్యాండ్ చేయటం నిప్పుల మీద నడకలాంటిదే. ఈ విషయంలో ఏ మాత్రం తప్పు జరిగినా ఫలితం దారుణంగా మారుతుంది. అదే పరిస్థితి తాజా ఉదంతంలోనూ చోటు చేసుకుంది.

మరో కీలకమైన అంశం.. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానం ఎంత వేగంతో రన్ వే ను తాకాలన్న దానిపై కచ్ఛితమైన మార్గదర్శకాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం విమానం దిగాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంతో.. దిగటం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

కోజికోడ్ విమానాశ్రయాన్ని చూస్తే.. ఈ రన్ వేకు ఇరువైపులా.. ముందు వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాలతో పోలిస్తే.. వీటి నిడివి చిన్నగా ఉంటాయి. ఎంతో నైపుణ్యం ఉన్న పైలెట్లు కూడా ఒక్కోసారి అయోమయానికి గురవుతారని చెబుతారు. పైలెట్లు చేసే వెంట్రుకవాసి తప్పులకు సైతం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అలాంటిదే తాజా ఉదంతంలోనూ చోటు చేసుకుంది. గతంలో.. ఈ ఎయిర్ పోర్టు డిజైన్ మీద అభ్యంతరాలు ఉన్నాయని చెబుతారు. దీనిపైన నివేదిక కూడా కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. అయితే.. నిర్ణయం తీసుకోవటంలో దొర్లిన నిర్లక్ష్యం కూడా ఈ భారీ ప్రమాదానికి కారణంగా చెప్పక తప్పదు.