వైసీపీలోకి ప్రభాకర్ రెడ్డి…కానీ షరతు!

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జలాధర కంపెనీ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కూడా పోలీసులు దాదాపు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు.

ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ పనిచేస్తే తాను వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అని అన్నారు. అయితే, తాను వైసీపీలో చేరేందుకు కొన్ని షరతులు పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తే తాను వైసీపీలో చేరడానికి సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డి షరతు పెట్టారు.

అనంతపురం ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజధానిని అమరావతిలో కొనసాగిస్తానని జగన్ ప్రకటిస్తే తాను వైసీపీలో చేరతానని సంచలన ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తప్పుకోమన్నా అలాగే చేస్తానని, తన నిర్ణయంలో మార్పు ఉండదని అన్నారు. అమరావతి కోసం రైతులంతా కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేసీ ఆరోపించారు.

ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు, జగన్ పాలనలో 54 రోజులు జైలులో ఉన్నానని అన్నారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాగా, రాజధాని అమరావతిలోనే ఉంచితే తమ పదవులు వదిలేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే బాటలో జేసీ కూడా వెళ్లడం విశేషం.