బీఆర్ఎస్‌.. అంటే ఏంటో తెలియ‌దు.. 70 శాతం మంది మాట ఇదే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలంగాణ అధికార పార్టీ బీ(టీ)ఆర్ ఎస్ గురించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని.. కేంద్రంలో వచ్చేది కేసీఆర్ స‌ర్కారేన‌ని ఆ పార్టీ ప్ర‌ముఖులు త‌ర‌చు గా చెబుతుంటారు. అయితే.. అస‌లు బీఆర్ ఎస్ పార్టీ దేశంలో ఎంత‌మందికి ప‌రిచ‌యం అయింది? అనే ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. దేశంలో తాజాగా ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(సీఎస్‌డీఎస్‌) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ పేరుతో నిర్వహించిన సర్వేలో బీఆర్ ఎస్‌పై ఆస‌క్తికర విష‌యాలు వెలుగు చూశాయి.

మొత్తంగా 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో.. 7,202 మందితో నిర్వహించిన ఈ సర్వే.. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఒడిసా, ప‌శ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, యూపీ వంటి కీల‌క‌మైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 70 శాతం మంది ప్ర‌జ‌లు త‌మ‌కు బీఆర్ ఎస్ అంటే తెలియ‌ద‌ని స‌మాధానం చెప్పారు.అదేమైనా స్వ‌చ్ఛంద సంస్థా? అని ప్ర‌శ్నించిన వారు కూడా ఉన్నార‌ని స‌ర్వేలో చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న బీఆర్ ఎస్ ప‌రిస్థితి రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాట‌టం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో దీనికి ఈ స‌ర్వే ద‌న్నుగా మారింది.

ఇక‌, ద‌క్షిణాది నుంచి కేసీఆర్‌ను ప్ర‌ధానిగా కోరుతున్న వారు 0.2శాతం మంది కూడా లేక పోవ‌డం.. ఆయ‌న తెలంగాణ నాయ‌కుడే అని తీర్మానం చేయ‌డం ఈ స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసింది. పార్టీ గురించి తెలియ‌ద ని చాలా మంది ప్ర‌జ‌లు చెప్ప‌గా.. కేసీఆర్ గురించి మాత్రం 40 శాతం మంది ప్ర‌జ‌లు తెలుసున‌ని వ్యాఖ్యా నించారు. అయితే.. ఆయ‌న‌ను ప్ర‌ధానిగా అంగీక‌రిస్తారా? అంటే.. లేద‌ని ముక్త‌కంఠంతో చెప్పుకొచ్చారు. ఆయ‌న‌ను ఒక రాష్ట్ర నాయ‌కుడిగానే చూస్తున్న‌వారు 70 నుంచి 75 శాతం వ‌ర‌కు ఉన్నారు. మ‌రి దీనిని బ‌ట్టి.. బీఆర్ ఎస్ కేంద్రంలో ఏమేర‌కు చ‌క్రం తిప్పుతుందో చూడాలి.