ఏపీ సీఎం జగన్‌పైనా.. ఆయన ప్రభుత్వంపైనా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాను అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లిస్తున్నానని.. దీనికి సంబంధించిన లెక్కులు ఉన్నాయని.. అయినా కూడా కక్ష పూరితంగా తను ఉంటున్న ఇంటికి ప్రభుత్వం నోటీసులు పంపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే భయపడడానికి తాను సామాన్యుడిని కాదని సీఎం జగన్‌ను ఆయన హెచ్చరించారు.
తాను వచ్చే ఎన్నికల్లో గెలవడం.. అధికారం చేపట్టడం ఖాయమని.. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తానని చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్.. ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేలా కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. ఒకే ప్రాంతంలో వెయ్యి ఎకరాలు సేకరించి మనిషికి సెంటు ఇస్తానని అంటున్నారని మండిపడ్డారు.
సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారన్న చంద్రబాబు.. కనీసం మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ దోపిడీ, జగన్ అసమర్థత.. రాష్ట్ర ప్రజలకు శాపంలా మారిందని విమర్శించారు. జగన్‌ది బటన్ నొక్కుడు కాదని.. బటన్ బొక్కుడని.. విజయనగరం జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల రక్తాన్ని తాగుతున్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్రీకృత అవినీతి పెచ్చరిల్లిపోయిందన్న చంద్రబాబు.. ఆ అవినీతి సామ్రాజ్యానికి రారాజు జగన్ అని ఆరోపించారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ అవినీతే కారణమన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే.. వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం.. మళ్లీ ఛార్జీలు పెంచేందుకు యత్నించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలపై మోయలేని భారాలు మోపిన వైసీపీ ప్రభుత్వం ..వాటిని ప్రశ్నించిన వారిని కేసులతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక.. కేసులను ఎత్తేస్తామని పార్టీ కేడర్‌కు హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates