శ్మశానం వర్సెస్ సమాధి ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. రెండు రోజుల క్రితం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను పట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా ప్రచారకులు తెగ గోల చేస్తున్నారు. దానికి టీడీపీ కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా కౌంటరిచ్చేస్తున్నారు..
సెంటు భూమితో మీరేమి చేసుకుంటారు… సమాధి కట్టుకుంటారా అన్నది చంద్రబాబు ప్రసంగంలో ఒక వాక్యం. పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చారని అది ఏ విధంగానూ సహేతుకం కాదన్నది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. చంద్రబాబు తొందరపడి ఒక మాట అన్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సెంటు భూమి పథకంపై విమర్శలు చేయడంతో పాటు పేదలకు ఇకాస్త భూమి ఇవ్వాలన్న డిమాండ్ లో తప్పులేదని అయితే ఏకంగా సమాధులు అనే పద ప్రయోగం ఆమోద యోగ్యం కాదని కొందరి వాదన.
వైసీపీ మంత్రులు కూడా ఇప్పుడు చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. రాజధాని ప్రాంతంలోని పేదల పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అని అన్న మాటలు మాత్రం వైసీపీ వారికి గుర్తుకు రావడం లేదు. బొత్స ఆ ఉద్దేశంతో అని ఉండరన్నది మేరుగు నాగార్జున సహా పలువురు వైసీపీ నేతల వివరణ.