ట్విట్ట‌ర్ యుద్ధం స‌రే.. క్షేత్ర‌స్థాయి యుద్ధం ఏదీ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం చేస్తున్నారు. గ‌త నాలుగు రోజు లుగా మూడు ట్వీట్ల‌తో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తొలిరోజు పాపం ప‌సివాడు అంటూ.. ఓల్డ్ సినిమా పోస్ట‌ర్‌తో ఏకేశాడు. రెండో రాజు దొంగ‌ల‌కు దొంగ సినిమా టైటిల్‌తో విరుచుకుప‌డ్డారు.అదేస‌మ‌యంలో వీడియోల‌తో నూ విమ‌ర్శ‌లుగుప్పించారు. ఇక‌, తాజాగా శుక్ర‌వారం.. అన్న‌మ‌య్య డ్యాం కుప్ప‌కూలిన త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌పై ప్ర‌శ్న‌లు సంధించారు.

అయితే.. ఇదంతా బాగానే ఉన్నా..క్షేత్ర‌స్థాయిలో ఈ ట్వీట్ల‌యుద్ధం.. కామెంట్లు.. విమ‌ర్శ‌లు ఏమేర‌కు ప్ర‌జ ల‌కు చేరువ అవుతాయ‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా స‌మ‌యం లేదు. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. ఇవే విష‌యాల‌ను స్వ‌యంగా వారికి వివ‌రిస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పోనీ.. ఆయ‌న బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌ర‌పున పార్టీ కీల‌క నాయ‌కులను అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పంపించే ప్ర‌యత్నం చేయాల‌ని సూచిస్తున్నారు.

కేవ‌లం గూటిలోనిచిల‌క మాదిరిగా ఎన్ని పలుకులు ప‌లికినా.. ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా.. రాష్ట్రంలో ఫోన్లు వినియోగించేందుకు 60 శాతం మంది ఉన్నా.. వీరిలో ఎంత‌మంది ఈ ట్వీట్లు చూసి అర్ధం చేసుకుంటారు. ఇక‌, గ్రామీణ స్థాయిలో అయితే.. ఇది మ‌రింత త‌క్కువ‌గా ఉంది. సో.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇలా డిజిట‌ల్ ప్ర‌చారానికే ప‌రిమితం కావ‌డం వ‌ల్ల ప‌వ‌న్‌కు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సూచిస్తున్నారు.