ఈ సారి వేటు విజయసాయి రెడ్డి అనుచరుల మీద పడిందే!

ప్రాంతీయ పార్టీల్లో గ్రూపులు ఉన్నప్పటికీ అధినేతకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వర్గాలు నడిపిస్తారు. ఇలాంటి విషయాల్లో అధినేతలు సైతం చూసిచూడనట్లుగా ఉంటారు. వ్యవహారం ముదిరితే లెక్క తేల్చేద్దామన్నట్లుగా ఉంటారు. అయితే.. ఏపీ అధికార వైసీపీలో ఇప్పుడు గ్రూపు పంచాయితీల వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. ముఖ్యంగా విశాఖలో నెలకొన్న అధిపత్య పోరు.. అధికార పార్టీ వ్యవహరాల్ని రోడ్డు మీద పడేలా చేస్తున్నాయి. రోజురోజుకు వైసీపీ ముఖ్యనేతలు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన వైవీసుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డిల మధ్య పోరు మలుపులు తిరుగుతోంది.

మొన్నటికి మొన్న ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి డిసైడ్ చేసిన పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్ ఛార్జులకు సంబంధించిన పేర్లను.. రోజు వ్యవధిలో విజయసాయిరెడ్డి మార్పించేయటం.. జారీ చేసిన ప్రకటనను వెనక్కి తెచ్చి.. తన వర్గం వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వాదనలో నిజం ఉందన్నట్లుగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

విజయసాయి రెడ్డి డిసైడ్ చేసిన పేర్లు మారిన ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయనకు ప్రధాన అనుచరులుగా చెప్పే విశాఖ నగర 60వ వార్డుకార్పొరేటర్ పీవీ సురేశ్.. 89వ వార్డు కార్పొరేటర్ దొడ్డి కిరణ్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా వీరిపై ఆరోపణ మోపారు. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఇదంతా కూడా వైవీ సుబ్బారెడ్డి పుణ్యమేనంటూ విజయసాయి వర్గం వారు ఆరోపిస్తున్నారు. నిజంగానే వేటు నిర్ణయం పద్దతి ప్రకారం జరిగి ఉంటే.. ఈ అంశంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు.. మేయర్.. ఫ్లోర్ లీడర్లకు తెలీకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. వేటు పడిన ఇద్దరు కార్పొరేటర్లు విజయసాయికి అత్యంత సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా విజయసాయి ఉన్నప్పుడు పీవీ సురేశ్ కు ట్రేడ్ యూనియన్ లో డైరెక్టరు పోస్టు ఇచ్చారు.

ఇక.. దొడ్డి కిరణ్ అయితే విజయసాయి శిలా శిగ్రహాన్ని ఏర్పాటు చేసి తన స్వామిభక్తిని ప్రదర్శించారు. ఇలాంటి ఇద్దరి పైనా ఎన్నో ఆరోపణలు గతంలోనూ ఉన్నా.. ఇప్పుడే వేటు వేయటం దేనికి నిదర్శనం అన్నది చర్చగా మారింది. మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డిల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. అధినేత జగన్ ఒక చూపుచూస్తే అన్ని సర్దుకుంటాయన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ ఆ పని ఎప్పుడు చేస్తారు?