తాను ఎంపీగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసి కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఎవరినీ లెక్క చేయని, ఉపేక్షించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టలేని ఇబ్బందికర పరిస్థితిని ఆయన కల్పించారు.
చర్చనీయాంశంగా మారిన అనేక అంశాలపై ఆయన పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. తాజాగా రాజధాని మార్పు విషయంలోనూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇదిలా ఉంటే.. వైకాపా వర్గాల నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. తనకు భద్రత కల్పించాలని లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో పాటు ఆయన ఢిల్లీ స్థాయిలో గట్టిగానే ప్రయత్నం చేశారు.
కేంద్ర హోం మంత్రిని కూడా కలిశారు. తనకు సెక్యూరిటీ వచ్చాక క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ సమస్యలపై పోరాడతానని.. తనను బెదిరిస్తున్న వైకాపా వర్గీయులను ఎదుర్కొంటానని ఆయన గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రఘురామ కృష్ణంరాజు కోరిక ఫలించింది. కేంద్రం ఆయనకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. దీని కింద 11 మంది సెక్యూరిటీ సిబ్బంది రఘురామకు రక్షణ కల్పిస్తారు. దేశంలో చాలా తక్కువ మంది వీఐపీలకు మాత్రమే ఈ రక్షణ ఉంది. సొంత పార్టీ నేతల నుంచి ముప్పు ఉందన్న కారణం చెప్పి ఇలా వై కేటగిరి రక్షణ పొందిన అరుదైన నాయకుడిగా రఘురామ నిలవబోతున్నారు.
ఇది ఒక రకంగా వైకాపా అధినాయకత్వంపై రఘురామ కృష్ణంరాజు నైతిక విజయంగా భావించవచ్చు. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న బలమేంటో దీని ద్వారా స్పష్టమైంది. ఈ ఊపులో ఆయన మరింతగా వైకాపాను టార్గెట్ చేసే అవకాశముంది. తనకు సెక్యూరిటీ రాగానే.. అమరావతి రైతుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటానని.. వారికి మద్దతుగా పోరాడతానని ఇటీవల రఘురామ కృష్ణంరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates