పుత్రోత్సాహంలో తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు

పుత్రోత్సాహ‌ము తండ్రికి పుత్రుడు జ‌నియించిన‌పుడు కాదు.. అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని నిజం చేస్తూ.. తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు కుమారుడు త‌న్నీరు అర్చిష్‌మ‌న్‌.. ప్ర‌తిష్టాత్మక అమెరికా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఇంజ‌నీరింగ్‌లో ప‌ట్టా అందుకున్నారు. దీంతో మంత్రి హ‌రీష్ రావు పుత్రుడి విజ‌యాన్ని స్వ‌యంగా వీక్షించి ఆనంద డోలిక‌ల్లో ఊగితేలుతున్నారు.

నా కుమారుడు సాధించిన విజయానికి నేను సంతోషిస్తున్నాను అని హ‌రీష్ రావు త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. అర్చిష్‌మ‌న్ విజ‌యానికి తాను గ‌ర్వ‌ప‌డ‌కుండా ఉండేల‌న‌ని తెలిపారు. త‌న కుమారుడి ప‌ట్టుద‌ల‌ను చూసి సంతోషిస్తున్నాన‌ని తెలిపారు.

హ‌రీష్ రావు కుమారుడు త‌న్నీరు అర్చిష్‌మ‌న్‌.. అమెరికాలోని బౌల్డ‌ర్‌లో ఉన్న ప్ర‌తిష్టాత్మ‌క కొల‌రాడో విశ్వ‌విద్యాల‌యంలో సివిల్ ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చూపిన ప్ర‌తిభ‌కు.. గ్లోబ‌ల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును కైవ‌సం చేసుకున్నారు. విశ్వ‌విద్యాల‌యంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును అందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు.. మంత్రి హ‌రీష్ రావు అగ్ర‌రాజ్యానికి వెళ్లారు. కార్య‌క్ర‌మ వేదిక‌పై కుమారుడు అవార్డు అందుకుంటుండ‌గా ప్ర‌త్య‌క్షంగా వీక్షించి.. త‌న్మ‌య‌త్వానికి లోన‌య్యారు. అర్చిష్మాన్ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని హ‌రీష్‌రావు పేర్కొన్నారు.

కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా హైద‌రాబాద్ న‌గ‌ర్ డెస్టినేష‌న్‌గా మారుతోంద‌ని చెబుతున్న తెలంగాణ మంత్రులు త‌మ పిల్ల‌ల‌ను అమెరికాలో చ‌దివించ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొంద‌రు సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు కూడా సంధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.