అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని అధికార పార్టీ వైసీపీ అంటోంది. మరోవైపు, అమరావతి రాజధాని అని రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికే అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు సగం పూర్తయ్యాయని విపక్ష టీడీపీ చెబుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో, సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల అమలుపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ కో ఇవ్వాలని, ఆగస్టు 14 వరకు ఆ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

రాజధాని పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణం కోసం రూ.52వేల కోట్ల విలువైన నిర్మాణాలు చేపట్టారని తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంత…? ఆయా నిర్మాణాలు ఏ దశలో ఆగిపోయాయి….అన్న వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ నిర్మాణాలు ప్రజాధనంతో నిర్మించినవని, అవి అర్ధంతరంగా ఆగిపోతే రాష్ట్ర ఖజానాకు నష్టమేనని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ఎన్ని బిల్డింగ్‌లు పూర్తయ్యాయి..? ఏ దశలో ఉన్నాయి…కాంట్రాక్టర్లకు ఇంకా ఎంత డబ్బు చెల్లించాలన్న వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

రాజధాని తరలిస్తే…ఇప్పటికే ఉన్న పూర్తయిన భవనాలు నిరుపయోగమవుతాయని….వాటిని వాడుకోకపోతే అవి పాడైపోతాయని హైకోర్టు అభిప్రాయపడింది. అటువంటి పక్షంలో ఆ నిర్మాణాల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

ఆ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించాలని రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.