ముందస్తు ఎన్నికలు.. ఆ మాట చెబితేనే జనంలో ఓ ఊపు వస్తుంది. దసరానో, దీపావళో, క్రిస్మసో, రంజానో వచ్చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. సరదాగా, పండుగలా ఓ నెల రోజులు గడిచిపోతుందన్న ఆనందం ఓటర్లలో రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలొస్తున్నాయనే మాటకు విశ్వసనీయత ఉన్నా లేకున్నా జనం ఆనందంలో మునిగిపోతారు. వస్తే బాగుండును అనుకుంటారు. కాకపోతే వాళ్ల విన్న వార్తలు 90 శాతం టైమ్ లో నిజం కావు. మీడియా రాసే కథనాలు మాత్రమే..
ఈ సారైనా నిజమవుతుందా.. ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. గత నాలుగు నెలల్లో మీడియా మూడు సార్లు ఈ వార్త రాసింది. తాజాగా మీడియా డిసెంబరు డెడ్ లైన్ పట్టేసింది. అక్టోబరులో అసెంబ్లీని రద్దు చేసి నవంబరులో షెడ్యూల్ ప్రకటించి, డిసెంబరులో ఎన్నికలకు వెళ్తారని ఇప్పుడు మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వ్యతికేతక, పెరుగుతున్న అప్పులను దృష్టిలో ఉంచుకుని జగన్ ముందస్తుకు వెళ్తున్నారని ఒక విశ్లేషణ. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఏప్రిల్ దాకా నెట్టుకురావడం కష్టమని తేల్చారు. అంటే ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే అక్టోబరు నుంచి అప్పటి వరకు అంటే మరో ఆరు నెలలు అప్పుల కోసం కష్టపడాలి. అలా రోజు గడవడానికి కష్టపడే కంటే ఎన్నికలకు వెళ్తే ఒక డైవర్షన్ లా ఉంటుందని జగన్ భావిస్తున్నారట. ఒక సారి ఎన్నికల్లో గెలిస్తే ఇక విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం ఉండదన్నది జగన్ వశ్వాసమట.
ఏప్రిల్ లో లోక్ సభకు..
నిజానికి లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లో జరగాలి. వాటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణ అసెంబ్లీ మాత్రం డిసెంబరుతో ముగిసిపోతుంది. తెలంగాణతో పాటు అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిపితే తనకు అనుకూలంగా ఉంటుందన్నది జగన్ ఆలోచన అని అంటున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఒక వార్త. ముందస్తు ఎన్నికలు లేవు.. మనం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని జగన్ పార్టీ వారికి చెబుతూ ఉంటారట. గుంభనంగా, చాప కింద నీరులా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అసెంబ్లీ షెడ్యూల్ పదవీకాలానికే ఎన్నికలు జరిగితే జగన్ కు ఇబ్బందులుంటాయట. అందుకే ముందుగా ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారన్నది మీడీయా కథనాల సారాంశం.
ముందస్తుకు వెళితే జగన్ కు మూడు నాలుగు ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలో కొనసాగుతూనే ఎన్నికలు నిర్వహించే అవకాశం వస్తుంది. కేంద్రం కచ్చితంగా తనకు సహాయం చేస్తుందనేది ఆయన నమ్మకం. మరీ ముఖ్యంగా అక్టోబరు నాటికి రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆర్థిక కష్టాలను ఎన్నికల పేరిట అధిగమించవచ్చన్నది మరో అంశం. కేంద్రం తాను కోరిన మేర అప్పులకు అవకాశం ఇస్తుందని, ఏడాది మొత్తానికి తీసుకురావలసిన అప్పులను ఆరు నెలల్లోనే మొత్తం తీసుకొచ్చేసి పథకాలకు ఖర్చుచేయొచ్చని జగన్ ఆలోచన. ఎన్నికలు అయిపోయాక పథకాలు ఆపేసినా.. పన్నులతో మరింత బాదినా.. అడిగే నాథుడు ఉండడని ఆయన గట్టిగా భావిస్తున్నారు.
తెలంగాణలోనూ ప్రచారం..
నిజానికి గతేడాది ఆగస్టు నుంచి తెలంగాణలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఏడాది ముందు అంటే 2022 డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం చేశారు. చాలా రోజులు మౌనంగా ఉన్న కేసీఆర్.. ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదని ఈ ఏడాది మొదట్లో ప్రకటించేశారు. ఇప్పుడు మే నెల వచ్చిన తర్వాత ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా ఒక్కటే కాబట్టి అలాంటి ప్రచారాలు ఆగిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏపీ విషయంలో కూడా అంతేనా లేకపోతే నిజంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా.. తెలియాలంటే కొంచెం టైమ్ పడుతుంది..