జడ్జీలు జగన్ వెంట్రుకని కూడా కదపలేరు

YS Jagan Pandula

ప్రేమ.. అభిమానాలు ఉండటం తప్పు కాదు. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. తిరిగి తిరిగి.. తాము ప్రేమించే వారికే శాపంగా మారటం.. షాకులిచ్చేందుకు కారణం కావటాన్ని జీర్ణించుకోలేరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతుంది. వరుస పెట్టి కోర్టుల్లో జగన్ కు ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం.. వెనుకా ముందు చూసుకోకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవటం.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్న మొండితనం కూడా కారణం.

ఇలాంటి వాటికి తోడుగా.. జగన్ ను విపరీతంగా అభిమానించి.. ఆరాధించే నేతలు.. ఫాలోయర్లు.. అభిమానులు తమ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. వ్యక్తుల గురించి.. వ్యవస్థల గురించి పరుష వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన పెరుగుతోంది. ఇలాంటి ధోరణికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆయన ఆ పని చేయటం లేదు. గతంలోనూ ఏపీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ ఎపిసోడ్ లోనూ కోర్టుతీర్పు ఇచ్చిన వేళ.. నోటికి వచ్చినట్లుగా సోసల్ మీడియాలో చెలరేగిపోయిన జగన్ అభిమానగణం చేసిన హడావుడి సుప్రీం సైతం ఈ మధ్యన ప్రస్తావించి.. ఆ వివరాలు.. ఆ సందర్భంగా తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని చెప్పటాన్ని మర్చిపోకూడదు.

తాజాగా ఇలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేత.. తమ రాజకీయ శత్రువుగా ఫీలయ్యే చంద్రబాబు మీద చేస్తే ఓకే. కానీ.. న్యాయవ్యవస్థలో కీలకమైన జడ్జిలు నొచ్చుకునేలా.. వారి మనోభావాలు దెబ్బతినేలా.. వారిని చిన్నబుచ్చేలా వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్ప పడుతున్నారు. అధికారంలో ఉన్న తమను ఎవరు ఏమీ చేయలేరన్న ధీమా ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. కానీ.. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు.

జ్యూడీషియరీ కానీ.. చంద్రబాబుకానీ.. జడ్జీలు కానీ.. కేసులుకానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవన్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ.. ఈ తరహాలో నోరు పారేసుకున్నారు. రాజధాని రైతుల శాపమే బాబు ఘోర పరాజయం పాలు చేసిందన్న ఆయన.. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న వారంతా రైతులు కాదని.. వారి ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా అభివర్ణించారు. విశాఖను ఎలాంటి స్వార్థం లేకుండా రాజధానిగా ఎంపిక చేశారన్నారు. తన తల్లి విశాఖలో పోటీ చేసి ఓడారు. ఆ నగరం నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు .అయినప్పటికీ రాజకీయ స్వార్థం లేకుండా విశాఖను రాజధాని నగరంగా ప్రకటించరన్నారు.

ఒకవేళ జగన్ కు స్వార్థమనేదే ఉంటే.. కడపనో.. పులివెందులనో రాజధాని నగరంగా ప్రకటించేవారన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నైనా చేయొచ్చు.. కానీ మధ్యలో కోర్టులు.. న్యాయమూర్తుల్ని లాగటం ఎందుకు? తాము అమితంగా ఆరాధించే జగన్ కు తలనొప్పులు వచ్చేలా నోరు పారేసుకోవటం ఎందుకు? ఇలాంటి వారిని జగన్ అదుపు చేయలేరా? తనకు షాకులిస్తున్న ఈ తరహా నోరు పారేసుకోవటాలకు చెక్ చెప్పకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు.