ప‌వ‌న్ ఎఫెక్ట్‌.. ఏపీలో ప్ర‌భుత్వం క‌దిలిందిగా!

అకాల వ‌ర్షాల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌ను ఆదుకోవ‌డంలోఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల మైంద‌నే వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. క‌నీసం.. ధాన్యాన్ని ప‌ట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని.. ఆయ‌న వ‌స్తే.. యాగీ చేస్తార‌ని అనుకున్న ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల్లో హుటాహుటిన స‌రుకును ఖాళీ చేసింది. దీంతో చంద్ర‌బాబుకుఛాన్స్ ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌నే వ్యూహాన్ని ప‌న్నింది.

ఇక‌,ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాక‌తో..  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్ర‌భుత్వం అలానే చేస్తోంది.  ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన‌ రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించ‌నున్నారు.  జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.

గ‌త రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మ‌రోవైపు.. ఏదో ఒక‌ర‌కంగా న్యాయం జ‌రుగుతోంద‌ని.. భావించిన జ‌న‌సేన నాయ‌కులు.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంట‌నే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా ప‌వ‌న్ ఎఫెక్ట్‌బాగానే ప‌నిచేసింద‌నే టాక్ వినిపిస్తోంది.