ఏపీలో అందుకే రోడ్లేయ‌ట్లేదా..మంత్రివ‌ర్యా?

ఏపీలో రోడ్లు వేయ‌డం లేద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ గుంత‌లే క‌నిపిస్తున్నాయ‌ని.. రోడ్ల‌పై ప్ర‌యాణించాలంటే.. ఒళ్లంతా హూనం కావాల్సిందేన‌ని.. ప్ర‌జ‌ల్లో ఒక టాక్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇక, ఏపీ ర‌హ‌దారుల గురించి.. తెలంగాణ మంత్రులు సైతం అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు కామెంట్లు చేసి కాక పుట్టించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజ‌న్న దొర‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో రోడ్లు ఎందుకు పాడ‌వుతున్నాయో.. ఎందుకు వేయ‌డంలేదో.. కూడా ఆయ‌న పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిం చారు. దీంతో రాజ‌న్న‌దొర చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో అందుకే రోడ్లు వేయ‌లేదా? మంత్రివ‌ర్యా అని కొంద‌రు.. ఔనా.. మంత్రిగారూ. ఇన్నాళ్ల‌కు మా క‌న్నులు తెరిపించారే! అని మ‌రికొంద‌రు కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు. దీంతో మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ మంత్రి ఏమ‌న్నారంటే..

గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే వినియోగించుకుంటున్నారని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి, కొట్టుపరువు పంచాయతీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

‘ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న సెటిలర్లు భారీ వాహనాలను తిప్పుతుండటంతో రోడ్లు గుంతలుగా మారుతున్నాయి. అందుకే కొత్త‌గా రోడ్లు వేయ‌డం లేదు. ఇలా పాడైన వాటిని బాగు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. కొట్టుపరువు పంచాయతీలో రోడ్డు వేయాలని చూస్తే ఓ సెటిలర్‌ ఆపారు. అది సరికాదు. ఈ ప్రాంతాన్ని షెడ్యూల్డ్‌ ఏరియాగా ప్రకటిస్తే నష్టపోయేది సెటిలర్లే…’ అని రాజన్నదొర పేర్కొన్నారు.ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.