రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై కేసీయార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే రెండు నియోజకవర్గాల్లో పోటీచేసే విషయమై ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం కేసీయార్ గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్ నుండి కాకుండా వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీచేస్తే ఎలాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
గజ్వేలుతో పాటు మరో కొత్త నియోజకవర్గమా ? లేకపోతే పూర్తిగా రెండు కొత్త నియోజకవర్గాల్లో పోటీచేయాలా అనే విషయమై సీరియస్ గానే ఉన్నారట. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీ అనుకున్నంతగా బలేపేతం కాలేదట. పైగా ఆరోపణలు విపరీతంగా ఉన్నట్లు సర్వేల్లో బయడపటింది. అందుకనే పై రెండు నియోజకవర్గాల్లో తాను పోటీచేస్తే జిల్లాల్లో మంచి ఫలితాలు వస్తాయని కేసీయార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక గజ్వేలులో ఎవరిని పోటీకి దింపినా గెలుపు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారట.
ప్రస్తుతం నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే తాను రెండు చోట్ల పోటీచేయటం కూడా ఒకమార్గంగా కేసీయార్ ఆలోచిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని కాంగ్రెస్ ఆశిస్తున్న జిల్లాల్లో మహబూబ్ నగర్, నల్గొండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మహబూబ్ నగర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంతజిల్లా. అలాగే నల్గొండ ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి బలమైన నేతలున్న జిల్లా.
పై రెండు జిల్లాల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే తాను స్వయంగా రంగంలోకి దిగక తప్పదని కేసీయార్ కు అర్ధమైందట. ఇక్కడ రంగంలోకి దిగటమంటే ఏదో ప్రచారం చేయటం కాకుండా స్వయంగా పోటీచేస్తేనే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని కేసీయార్ అనుకుంటున్నారని తెలిసింది. అందుకనే రెండుచోట్ల పోటీచేసే విషయాన్ని సీరియస్ గానే ఆలోచిస్తున్నారట. మరి కేసీయార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు కూడా తక్కువేమీ తినలేదు కాబట్టే.