పీపీఈ కిట్ ధరించిన కేటీఆర్ !

KTR

కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. నలుగురిని కలిసే విషయంలో కేసీఆర్ కు చాలానే లెక్కలు ఉంటాయని చెబుతారు.

అందుకు భిన్నంగా ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మాత్రం.. వీలైనంత ఎక్కువమందిని కలుస్తుంటారు. ఎవరైనా.. ఏదైనా కొత్త కార్యక్రమం చేపడుతుంటే.. దాని గురించి తెలుసుకోవాలనే తపనతో పాటు.. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా? అన్న కోణంలో దాన్ని చూడటం ఆయన ప్రత్యేకత. అందుకోసం తానే స్వయంగా వెళతారు. పలువురిని కలుస్తుంటారు. భేటీ అవుతుంటారు.

నలుగురిని తన వద్దకు పిలిపించుకునే గుణం కేసీఆర్ కు వుంటే.. నలుగురి వద్దకు తానే వెళ్లటం మంత్రి కేటీఆర్ స్టైల్ గా చెప్పాలి. రోటీన్ రాజకీయ నేతకు కాస్త భిన్నంగా ఉండే ఆయన.. కరోనా వేళ.. ముఖానికి మాస్కులు పెట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. తన తండ్రి కేసీఆర్ కు భిన్నంగా ఆయన తరచూ తన మాస్కుల్ని మార్చేస్తుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే.. రోజులో పలుమార్లు పలు మాస్కులు పెట్టుకునే అతి కొద్ది మంది రాజకీయ నేతల్ లోకేటీఆర్ ఒకరని చెప్పాలి.

అలాంటి ఆయన.. తాజాగా ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. పూర్తిస్థాయి పీపీఈ కిట్ ధరించిన ఆయన.. ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్ సైంటిస్టు క్రిష్ణా ఎల్లాతో భేటీ అయ్యారు. కరోనా టీకా పరిశోధనలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్ బయోటెక్ సీఎండీ అయిన ఆయన.. టీకా ఉత్పత్తికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.

ఇందులో భాగంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండటంతో.. మంత్రి కేటీఆర్ పీపీఈ కిట్ ను వినియోగించారు. జీనోమ్ వ్యాలీలోని ల్యాబ్ ను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల గురించి వివరాల్ని తెలుసుకున్నారు. అనంతరం వెబ్ నార్ లో పాల్గొన్నారు. ఏమైనా.. ఇప్పటివరకూ ఎప్పుడు కనిపించని రీతిలో పీపీఈ కిట్లో కేటీఆర్ కనిపించటం అందరిని ఆకర్షించే అంశంగా చెప్పక తప్పదు.