జనసేన ఒక స్వతంత్ర పార్టీ అని, పవన్ కల్యాణ్ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభిప్రాయపడ్డారు. స్వతంత్ర పార్టీగా ఉన్న జనసేన తమకు మిత్రపక్షంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి పవన్ కలత చెందారని, ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది ఆయన ప్రయత్నమని పేర్కొన్నారు.
తిరోగమనంలో నడుస్తున్న రాష్ట్రాన్ని పురోగమనంలోకి తీసుకొచ్చే విషయాలపై జనసేన, బీజేపీ చర్చిస్తున్నాయన్నారు. ఈ అంశాలపై పవన్, బాబు మధ్య చర్చలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వారిద్దరి మధ్య దేనిపై చర్చ నడిచిందో వారే చెప్పాలన్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడారని తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కలిగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జనసేన, బీజేపీ భావిస్తున్నాయని సత్యకుమార్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. శిశుపాలుడి నేరాల లెక్కింపు క్రమంలో ఈ చార్జిషీటు కమిటీ ఏర్పడిందన్నారు. ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో అక్రమాలు, అకృత్యాలు, కబ్జాలు, దౌర్జన్యాలను ప్రజలు చూశారన్నారు. వాటిని ప్రజాక్షేత్రంలో అంశాలగా వారీగా తీసుకెళ్లి వివరిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. మంత్రులు అబద్ధాలు చెప్పడంలో అగ్రగణ్యులుగా తయారయ్యారని దుయ్యబట్టారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యపానాన్ని సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. సీఎం నుంచి నాయకుల వరకు అవినీతి, దోచుకోవడమే ఆలోచనా విధానామన్నారు. వాటిని అడ్డుపెట్టకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నా రన్నారు. అవినీతి, అరాచక వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates