ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతులను ఎన్నికలకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారంటూ పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఆళ్లపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రాజధాని తరలింపుపై తమ ఆవేదన చెప్పుకునేందుకు ఆర్కే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రైతులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేసినందుకు ఆళ్లపై చీటింగ్ కేసు పెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ఆళ్ల చేసిన ప్రకటనను తమ ఫిర్యాదుకు రైతులు జత చేశారు. అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు ముందు చెప్పిన ఆళ్ల…ఇపుడు విశాఖకు రాజధాని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని విషయంలో అపుడో మాట..ఇపుడో మాట…చెప్పినందుకు ఆళ్లపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఫిర్యాదుపై మంగళగిరి టౌన్, రూరల్ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.