జగన్ పాలనకు ముగింపు పలికి ఎలాగైనా అధికారంలోకి వస్తామని టీడీపీ రోజురోజుకీ తన నమ్మకం పెంచుకుంటున్నా కొన్ని నియోజకవర్గాలలో నాయకులు మాత్రం వెనుకడుగు వేస్తున్నారట. దానికి కారణం వారు తమకు టికెట్ వస్తుందని నమ్మకపోవడమేనట.. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే తమ సీటు జనసేనకు ఇస్తారన్న అనుమానాలున్న నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు యాక్టివ్‌గా తిరగడం లేదని చెప్తున్నారు.
టికెట్ వస్తుందో రాదోనని.. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సీటు రాదనే అనుమానంతో ఖర్చుకు వెనుకంజ వేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానంతో ఉన్నారని.. ఈ కారణంగానే వారు యాక్టివ్‌గా లేరని చెప్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో ఇబ్బందులు నెలకొన్నాయి.
కాగా ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికీ చేరింది. దీంతో ఏ ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదనే దానిపై దృష్టి పెట్టారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకి విజయావకాశాలున్నాయనే సంకేతాలను పంపుతున్నారు. అధికార వైసీపీకి దీటుగా నిరంతరం ప్రజల్లో ఉండేట్లు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు.. పొత్తులతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరి కలిసి పోటీ చేసినా కూడా జనసేనకు టీడీపీ ఓటింగ్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలని.. అందుకోసం కూడా ఇప్పటి నుంచి జనాన్ని టీడీపీ వైపు ఆకర్షించాలని చంద్రబాబు సూచిస్తున్నారు.
చంద్రబాబు నుంచి సూచనలు వస్తున్నప్పటికీ జనసేనకు ఇస్తారనే అనుమానం ఉన్న నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు మాత్రం డబ్బులు ఖర్చు చేయడం లేదు. దీంతో రాష్ట్ట్రమంతా టీడీపీలో ఉత్సాహం కనిపిస్తున్నా ఆయా నియోజకవర్గాలలో మాత్రం నీరసం కనిపిస్తోంది. మరి.. చంద్రబాబు పొత్తుల సంగతి తొందరగా తేలుస్తారా.. లేదంటే, చేజేతులా అవకాశాలు వదులుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates