ఏం చేస్తాం.. తిరుమ‌ల‌పై హెలికాప్ట‌ర్లు తిరిగాయి: వైవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెండు రోజుల కింద‌ట తిరుమ‌ల ఆనంద నిల‌యంపై హెలికాప్ట‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మూడు హెలికాప్ట‌ర్లు ఆనంద నిల‌యం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఇలా ఆనంద నిల‌యం మీదుగా వెళ్ల‌రాద‌ని ఎప్ప‌టి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. కేంద్రానికి అనేక సంద‌ర్భాల్లో లేఖ‌లు రాసింది. అయినా కూడా త‌ర‌చుగా ఆనంద నిల‌యం మీదుగా విమానాలు.. హెలికాప్ట‌ర్లు ప్ర‌యాణిస్తున్నాయి.

ఇక‌, తాజా విష‌యంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని.. ఆర్మీ అధికారుల‌కు చెందిన వాహ‌నాలుగా గుర్తించామ‌న్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో క‌ల‌కలం రేపాయి. శ్రీవారి భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలిక‌గా రియాక్ట్ అయ్యారు. ఇంత జ‌రిగి.. దేశ‌వ్యాప్తం గా భ‌క్తులు ఆవేద‌న చెందుతున్న విష‌యాన్ని ఆయ‌న లైట్ తీసుకున్నారు.

“ఔను. నేను కూడా బాధ‌ప‌డ్డా. ఏం చేస్తాం. తిరుమ‌లపై హెలికాప్ట‌ర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవ‌ని తెలిసిందన్నారు. దీనిపై అధికా రుల‌కు టీటీడీ ఫోన్ చేసి వివ‌ర‌ణ కోరే ప‌రిస్థితి లేద‌న్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్త‌త వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయ‌ని.. అయితే.. అప్ప‌ట్లో మాత్రం ఇంత వివాదం కాలేద‌ని.. ఇప్పుడు మాత్రం ప్ర‌తి విష‌యాన్నీ బూత‌ద్దంలో చూస్తున్నార‌ని విమ‌ర్శించారు.