కేసీఆర్‌ను గ‌ద్దె దింపుతాం.. ప్ర‌ధాని పీఠం ఖాళీగా లేదు: అమిత్ షా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గ‌ద్దె దింపుతామ‌న్నారు. అంతేకాదు.. ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు ఫ‌లించ‌బోవ‌ని.. ప్ర‌దాని పీఠం ఖాళీగా లేద‌ని.. ఖాళీ కాబోద‌ని కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

“బండి సంజయ్‌ను కేసీఆర్‌ జైల్లో వేయించారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. 24 గంటల్లో బండి సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటలను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కేంద్రం అందించే పథకాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. మోడీని ప్రజల నుంచి కేసీఆర్‌ దూరం చేయలేరు. కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారు” అని అమిత్ షా అన్నారు.

యువకుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. లీకేజీపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, కేసీఆర్‌.. ప్రధాని సీటు ఖాళీగా లేదు.. అని హెచ్చ‌రించారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోడీనే ప్రధానిగా ఉంటార‌ని తెలిపారు. ‘కేసీఆర్‌.. ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తాం’ అని చెప్పారు.

తెలంగాణలో హైవేల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు అమిత్ షా అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కేంద్రం అందించే వేల కోట్లు ప్రజలకు అందుతున్నాయా? అని కార్యకర్తలను అడిగారు. మూడేళ్లలో నాబార్డు ద్వారా రూ.60 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. రామగుండం విద్యుత్‌ కేంద్రం, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీక రణ, ఎంఎంటీఎస్‌ విస్తరణకు నిధులిచ్చామని ప్రకటించారు.