త్వరలో జగన్‌కు షాక్ ఇవ్వనున్న బీజేపీ

బీజేపీ, వైసీపీల మధ్య బంధం బ్రదర్ ఫ్రం ఎనదర్ మదర్ అన్నట్లుగా సాగుతోంది ఇంతవరకు. ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతున్నారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి ఈ అన్యోన్య బంధంలో ఆటుపోట్లు తప్పవని తెలుస్తోంది. జగన్ ఎంత అణకువగా ఉన్నప్పటికీ ఏపీలో పట్టు కోసం కాచుక్కూచున్న బీజేపీ తన పని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో ఉందని.. కొద్దిరోజులలో ఆ వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

జగన్ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను ఏపీ బీజేపీకి చెందిన కొందరు నేతలు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నిత్యం చేరవేస్తుండడంతో పైనుంచి వ్యూహం మారుతోందని.. వైసీపీ నుంచి చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ వంటివారు ఏపీలో వైసీపీ విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పాజిటివ్ నివేదికలే ఇస్తున్నారు. అయితే.. రాయలసీమకు చెందిన ఓ బీజేపీ నేత రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంలోని బీజేపీ నేతలకు సమాచారం ఇస్తుండడంతో వారు కూడా ఆలోచనలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పొరుగునే ఉన్న రాయలసీమ బీజేపీకి చెందిన కొందరు నేతలతోనూ బీజేపీ పెద్దలు మాట్లాడాక ఏపీపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో కామ్‌గా ఉన్న కొందరు సీనియర్లను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఈ కాంటాక్ట్స్‌తోనే వైసీపీ నుంచి కూడా వలసలు మొదలవబోతున్నట్లు చెప్తున్నారు. అధికార పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు కనుక మొదలైతే క్రమంగా పార్టీ పరిస్థితి మారుతుందని బీజేపీ నేతలు ఆశావహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండడం.. పవన్ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో బీజేపీ కూడా ఆచితూచి అడుగేస్తూ రాష్ట్రంలో పరిస్థితులను ఓ కంట కనిపెడుతోంది. అయితే.. అవకాశం దొరికితే జగన్‌కు షాకివ్వడానికి బీజేపీ ఏమాత్రం మొహమాట పడబోదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.