చంద్రబాబు దూకుడుగా వెళుతున్నారా ?

రాబోయే ఎన్నికల్లో అధికారం అందుకోవటమే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అధికారం అందుకోవాలంటే ముందు మెజారిటి సీట్లు గెలవాలి. మెజారిటి సీట్లు గెలవాలంటే అభ్యర్ధుల ఎంపికను పూర్తిచేసి వీలైనంత తొందరగా ప్రకటించేయాలి. అప్పుడే అభ్యర్ధులు జనాల్లో ఒకటికి రెండుమూడుసార్లు తిరిగి ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది. ఇదే సమయంలో తమపైన అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించి దారికి తెచ్చుకునే అవకాశాలుంటాయి. అలాకాకుండా గతంలో లాగే చివరి నిముషంలో అభ్యర్ధులను ప్రకటిస్తే అంతే సంగతులు.

ఈ విషయం రాజకీయంగా క్లైమ్యాక్సుకు చేరుకున్న దశలో చంద్రబాబుకు అర్ధమైంది. అందుకనే వీలైనన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇఫ్పటివరకు సుమారు 75 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. కొందరిని పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా ప్రకటించారు. ఇద్దరిలో ఎవరు ప్రకటించారని కాకుండా ఎన్నికలకు ఏడాదిముందే అభ్యర్ధుల ప్రకటనకు శ్రీకారం చుట్టారన్నదే కీలకం. అభ్యర్ధుల ఎంపికలో కూడా చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు.

రకరకాలుగా నేతలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని అన్నీ సర్వే రిపోర్టులను చూసుకుని అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇపుడు ప్రకటించిన అభ్యర్ధులను మార్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కాకపోతే జనసేనతో పొత్తు ఖాయమైతే అప్పుడు ఏమిచేస్తారనేదే పెద్ద ప్రశ్న. 175 నియోజకవర్గాల్లో 75 చోట్ల అభ్యర్ధులను ప్రకటించారంటే పొత్తులు, సీట్ల విషయాలను చంద్రబాబు ఆలోచించకుండానే ప్రకటిస్తారా ? అనే సందేహం కూడా ఉంది. ఇక్కడే తమ్ముళ్ళల్లో పెరిగిపోతున్న సందేహం ఏమిటంటే అసలు జనసేనతో పొత్తుంటుందా అని.

తమ్ముళ్ళల్లోనే కొందరేమో పొత్తులు అవసరంలేదని వాదిస్తుంటే మరికొందరేమో పొత్తుండాల్సిందే అని చెబుతున్నారు. చివరకు చంద్రబాబు నిర్ణయం ఎలాగుంటుందో తెలీదుకానీ ఇప్పటికైతే పొత్తుల విషయంలో తమ్ముళ్ళల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇపుడు ప్రకటించిన సీట్లలో అత్యధికం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలోని 14 సీట్లలో 11 చోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. వివాదాస్పదమైన ఆళ్ళగడ్డ, నంద్యాల, నందికొట్కూరులో మాత్రమే పెండింగ్ పెట్టారు. నంద్యాల, ఆళ్ళగడ్డలో భూమా కుటుంబానికి టికెట్లిస్తారా ఇవ్వరా అన్నదే సస్పెన్సుగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లిస్తారో చూడాల్సిందే.