ఉత్తరాంధ్రలో టీడీపీ రిలాక్స్

విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పార్టీ కేడర్ నూతనోత్సాహంతో పనిచేయాలి. మాతృసంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. ఉత్తరాంధ్ర టీడీపీలో మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి గెలిచిన తర్వాత విశాఖ టిడిపి నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పనిచేయాల్సిందేముంది.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు.

ఊపుమీదున్న వైసీపీ

రాష్ట్రంలోనూ, జీవీఎంసీ పీఠం మీద వైసీపీయే అధికారంలో ఉన్నా….ఆపార్టీ నేతలు మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో కసిగా పనిచేస్తున్నారు.ఇంటింటికి వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని…సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేవో అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా….ఆ పార్టీలో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి వైసిపి స్టిక్లర్లు స్వయంగా అంటిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా…వైసీపీ నేతలు ఇలా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ, స్టిక్కర్లు అంటిస్తుంటే, విశాఖలో చాలా మంది టీడీపీ నేతలు ఇంటికే పరిమితం అవుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. జగన్ అధికారం చేప్టటి నప్పటి నుంచి ఎన్నో వివాదస్పద నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు…ఇవన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లి గట్టిగా పోరాటం చేయాల్సిన బాధ్యత టీడీపీపై ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర నేతలు పట్టించుకోవడం లేదు.

అవినీతిని పట్టించుకోని టీడీపీ

జీ 20 సదస్సులో 100 కోట్ల అవినీతి జరిగిందని టిడిపి మినహా అన్ని రాజకీపార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం, పోరాటాలే చేస్తున్నాయి.జీ 20 పనుల్లో భారీ స్కాం జరిగిందని జనసేన,సీపీఎం, సీపీఐ.. ఆఖరికి చిన్నా, చితక పార్టీలు కూడా గగ్గోలు పెడుతుంటే…ఎందుకనో టీడీపీ నేతలు అసలు ఫోకసే చేయలేదు..చిత్రం ఏమిటంటే జీవీఎంసీ కౌన్సిల్ లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీయే..అయినా ఇంత పెద్ద స్థాయిలో ప్రజాధనం వృధా అయినా ఎందుకు స్పందించడం లేదని చాలా మందికి అర్ధం కాలేదు. వంద కోట్ల స్కాం మీద సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు… మేయర్ గొలగాని హరి వెంకట కుమారికి ఫిర్యాదు చేశారు..తక్షణమే ఆల్ పార్టీల ప్లోర్ లీడర్స్ తో కమిటీ వేసి విచారణ జరిపించాలని లేని పక్షంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక సీపీఐ కూడా జీ 20 పనుల అవినీతిపై తీవ్ర స్థాయిలో పోరాటం,నిరసనలు చేస్తోంది…ఈ కుంభకోణపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది.. జనసేన అయితే జీ 20 సదస్సు పనులలో అవినీతి జరిగినప్పటి నుంచి తీవ్రంగా పోరాటం చేస్తోంది. అలాగే మిగిలిన చిన్నా, చితక పార్టీలు కూడా నెల రోజు నుంచి పోరాటం చేస్తుంటే…ఇప్పటి వరకు టీడీపీ గట్టిగా స్పందించకపోవడం అందర్ని విస్మయ పరుస్తోంది.మిగిలిన పార్టీల కంటే ఎందుకు ఉధృతంగా పోరాటాలు చేయడం లేదో ఆ పార్టీ కార్యకర్తలకు అర్దం కావడంలేదు.

టీడీపీ భాగస్వామ్యం ఉందా..

కౌన్సిల్ లో…సింగిల్ డిజిట్ ఉన్న పార్టీలు పోరాడుతుంటే…ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం అసలు ఈ స్కాం పై దృష్టి పెట్టకపోవడం పై అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. అయితే ఇప్పుడు సరికొత్త వాదన తెరమీదకు వచ్చింది. 100 కోట్ల కుంభకోణంలో కొంతమంద టీడీపీ నేతల భాగస్వామ్యం కూడా ఉందని…అందుకే ఆ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. జీ 20 పనుల్లో టీడీపీకి చెందిన కొందరికి కాంట్రాక్టులు దక్కాయని…అందుకే సైలెంట్ అయిపోయారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.ఈ ఆరోపణలు నిజమో కావో తెలీయదు కానీ వాటికి బలం చేకూరేలా ప్రధాన ప్రతిక్షం అయిన టీడీపీ నేతల ప్రవర్తన ఉంది.