రెడ్డొచ్చె మొదలెట్టే అనే సామెత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాగా సరిపోతుంది. దశబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న కిరణ్ రోజుల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే బీజేపీ పలుకులు పలకటం మొదలుపెట్టేశారు. మీడియాతో మాట్లాడుతు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం బాగా సహకరిస్తోందట. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడున్న కేంద్రప్రభుత్వం కన్నా ఇప్పటి కేంద్రప్రభుత్వం ఎక్కువ సాయం చేస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొస్తామని చెప్పారు.
ఇప్పుడు విషయం ఏమిటంటే గడచిన ఎనిమిదిన్నర సంవత్సరాలుగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోంది. ప్రత్యేకహోదా ఇవ్వలేదు. విశాఖపట్నం రైల్వేజోన్ అంశాన్ని నాశనం చేసేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిదులు ఆపేసింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులను ఇవ్వనని చెప్పేసింది. జనాలు ఎంతమొత్తుకుంటున్నా పట్టించుకోకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేస్తోంది.
పైన చెప్పినవన్నీ అందరికళ్ళకు కనబడుతోంది. మరి అందరికళ్ళకు కనబడుతున్న దెబ్బ కిరణ్ కు కనబడకపోవటమే విచిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి హక్కుగా రావాల్సిన వాటిని కూడా మోడీ ప్రభుత్వం ఇవ్వటంలేదు. మరిక ఏపీ డెవలప్మెంట్ కు కేంద్రం ఏ విధంగా సహకరిస్తోందో అర్ధంకావటంలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ సేవచేయటానికి రెడీనట. అసలు కిరణ్ కు చేతనైన సాయం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. వాయల్పాడు నియోజకవర్గానికి ఎక్కువ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తక్కువ అన్నట్లుండేది ఒకపుడు కిరణ్ వ్యవహారం.
పొరుగునే ఉన్న మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్ళపల్లి నియోజకవర్గాల్లో కూడా కిరణ్ ప్రభావం ఉండేదికాదు. అలాంటి నల్లారి వారు తాను చాలా పెద్ద లీడర్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అధిష్టానం అస్తవ్యస్ధ నిర్ణయాలతో కాంగ్రెస్ దెబ్బతిన్నదని ఇపుడు చెబుతున్నారు. అధిష్టానం తీసుకున్న అస్తవ్యస్ధ నిర్ణయాల్లో తనను సీఎం చేయటం కూడా ఉందని కిరణ్ మరచిపోయినట్లున్నారు. ఏరుదాటేవరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత ఓడి మల్లన్న అన్నట్లుగా ఉంది కిరణ్ వ్యవహారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates