టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకప్పటి ఆయన వీర విధేయుడు.. మాజీ తమ్ముడు కొడాలి నాని తాజాగా భారీ సవాలు విసిరారు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఇరవైమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు సామూహిక రాజీనామాలు చేస్తామన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా బాబు తన ఎమ్మెల్యేలతో కలిసి సామూహిక రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ బాబు కానీ 20కి 20 సీట్లను ఎన్నికల్లో గెలిస్తే.. రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ.. టీడీపీ కానీ ఎన్నికల్లో ఓటమి పాలైతే మాత్రం మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలన్నారు.
గత ఎన్నికల్లో బాబు తీసుకున్న నిర్ణయాలతో విసుగుచెందిన ప్రజలు టీడీపీని ఓడించిన వైనాన్ని గుర్తు చేశారు. అదే పనిగా జూమ్ యాప్ లో చంద్రబాబు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క బాలయ్య మాత్రమే బాబు గెలిపించారన్నారు. టీడీపీకి కంచుకోటలా ఉండే ఉత్తరాంధ్రలో కూడా ఓటర్లు ఓట్లు వేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్లతో రాజధానిని నిర్మించటం ఏ మాత్రం సరికాదని.. అది సాధ్యం కూడా కాదన్నారు. మరి.. ఈ మాజీ తమ్ముడి సవాలుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.