కోర్టుకు వెళ్లాలంటే ట్రాఫిక్ ఇష్యూ

కోర్టుకు వెళ్లే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్సలు ఇష్టపడరు. కోర్టుకు హాజరయ్యేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్నింటిని వాడుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. తాను చెప్పే కారణాలకు సామాన్యుడు సైతం ప్రశ్నిస్తాడన్న విషయాన్ని ఆయన అస్సలు పట్టించుకోరు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి చేసిన కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

ఈ కోర్టు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. గత వాయిదాలో ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు రావాలంటూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తాజాగా పిటిషన్ వేస్తూ.. తాను అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తాను కోర్టు రాకపోవటానికి ప్రస్తావించిన కారణాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నానని.. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాల్ని నిర్వహించాల్సి ఉందని.. కోర్టుకు ముఖ్యమంత్రి హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అందుకే అడ్వకేట్ కమిషనర్ ను నియమించి.. ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేసేందుకు వీలుగా వెసులుబాటు ఇవ్వాలని పేర్కొనటం గమనార్హం.