‘రాహుల్‌కు జైలు శిక్షా.. ఆ జ‌డ్జి నాలుక కోస్తాం’

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నేరం రుజువై.. రెండేళ్ల జైలు శిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల్లో ఆయ‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వంపై కూడా వేటు ప‌డింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయ‌కుడు.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన న్యాయమార్తి నాలుక కోస్తామని వ్యాఖ్యానించారు.

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత మణికందన్ చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దిండిగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మణికందన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పందించి.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మణికందన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. అయితే న్యాయమూర్తిని బెదిరించినందుకు మణికందన్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

రాహుల్ గాంధీకి 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో నిరసన ర్యాలీని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మణికందన్.. రాహుల్ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించారు. ‘మేం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయమూర్తి నాలుక కోసేస్తాం’ అని మణికందన్ అన్నారు.

దీంతో న్యాయమూర్తిని బెదిరించినందుకు పలు సెక్షన్ల కింద మణికందన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇదిలావుంటే, కాంగ్రెస్ నేత‌ల‌కు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడం ఇప్పుడేమీ కొత్త కాద‌ని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. కోర్టు తీర్పులు వ్య‌తిరేకంగా వ‌స్తే ఇలా బెదిరింపుల‌కు దిగ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ కాలానికి ముందే కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్య‌వ‌స్థ‌పై దాడి చేసింద‌ని.. ప్ర‌స్తుతం తీవ్ర నిరాశతో దాడిని మరింత తీవ్ర‌త‌రం చేసింద‌న్నారు.