నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే.. ఏకంగా జ‌గ‌న్‌పైనే!

వైసీపీ ఎమ్మెల్యే ఒక‌రు నోరు జారారు. ఏకంగా.. త‌మ ఆరాధ్య దైవంగా భావించే సీఎం జ‌గ‌న్‌పైనే ఆయ‌న నోరు చేసుకున్నారు. తెలిసి అన్నారో.. తెలియ‌క అన్నారో తెలియదు కానీ.. సీఎం జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌ని తెగేసి చెప్పేశారు. అంతేకాదు.. మ‌రో ఐదేళ్లు అధికారం ఇస్తే..అప్పుడు అనుభ‌వం సంపాయించు కుంటార‌ని చెప్పుకొచ్చారు. దీంతో కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు నివ్వెర పోయారు.

క‌ర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే.. సాయిప్ర‌సాద్‌.. వైసీపీకి న‌మ్మిన బంటు. అయితే.. కొన్నాళ్లుగా ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సెగ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇటీవ‌ల కాలంలో దూరంగా ఉంటున్నారు. తాజాగా ప్రారంభించిన మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కార్య‌క్ర‌మానికి సంబంధించి … పార్టీ కార్య‌క‌ర్త‌లు, నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌కు అనుభ‌వం లేదు.. అందుకే.. త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్కు అనుభవం తక్కువ ఉందని.. మరో ఐదు సంవత్సరాలు పూర్తైతే మరింత అనుభవం వస్తుందని అన్నారు. అనుభవం ఉంటే మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే.. కొంద‌రు బ‌య‌ట‌కు చెబుతున్నారు.. చాలా మంది చెప్ప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయే ప‌రిస్థితి లేద‌ని సాయి ప్ర‌సాద్ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాల గురించి.. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారని అన్నారు. అయినా.. ప్ర‌తిప‌క్షాల దూకుడు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలోతాము ఏం చేసినా.. ఇప్పుడు క‌ష్ట‌మేన‌ని ఆయ‌న చెప్ప‌డం.. సంచ‌ల‌నంగా మారింది. మ‌రి వైసీపీఅధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.