తెలుగు రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన్ను అభిమానించే వారెందరో.. విమర్శించే వారు కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు మూసపోసినట్లుగా ఒకే ధోరణిలో ఉంటుంది.
ప్రాక్టికల్ గా ఉండే మాటల్లో భావోద్వేగం చాలా తక్కువ. ఎప్పుడో ఒకట్రెండు సార్లకు మించి ఆయన నోటి వెంట ఆ తరహా మాటలు వినిపించవు.
ఇక.. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దాని మీద కూడా మాట్లాడటం కనిపించదు. అన్నింటికి మించి.. మరణం గురించి ఆయన మాటల్లో ప్రస్తావనకే రాదు. అలాంటి చంద్రబాబు తొలిసారి భిన్నమైన తరహాలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ సర్కారు తీసుకోవటం.. తాజాగా దానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు.
తాను అనుభవించటానికి రాజధాని కట్టలేదన్న ఆయన.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా.. నలభై ఏళ్ల రాజకీయాల్లో ఉన్నానని.. తనకు అంతకు మించి ఏం కావాలన్నారు. ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు ఎక్కువగా బతికి ఉంటానన్న బాబు.. అమరావతి తనకోసమేమీ కాదని..ఈ విషయాన్ని ఏదో ఒకరోజు అందరూ తెలుసుకుంటారన్నారు.
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించారు. తాను చెప్పిన మాటల్లో నిజాన్ని.. భవిష్యత్తులో అందరూ ఒప్పుకుంటారని పేర్కొన్నారు. తనకు నచ్చని విషయాల్లో బాబు ఆగ్రహం వ్యక్తం చేయటం మామూలే. అందుకు భిన్నంగా ఈ స్థాయిలో భావోద్వేగంతో మాట్లాడటం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates