మూడు రాజధానుల బిల్లు ఆమోదంపై పవన్ స్పందనేంటి?

మొత్తానికి ఉత్కంఠ వీడిపోయింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో అమరావతిలో శాసన వ్యవస్థను మాత్రమే ఉంచి కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థలను విశాఖపట్నం, కర్నూలుకు తరలించడానికి జగన్ సర్కారుకు మార్గం సుగమమైంది. రాజధాని తరలింపును తెలుగుదేశంతో పాటు జనసేన ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో జనాలు అల్లాడుతున్న సమయంలో వారి క్షేమమే ముఖ్యమని.. రాజధానిపై చర్యలకు ఇది సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ సర్కారుపై పెద్దగా విమర్శలేమీ చేయని జనసేనాని.. తెలుగుదేశం ప్రభుత్వాన్నే ఎక్కువగా తప్పుబట్టడం గమనార్హం. రాజధానికి 33 వేల ఎకరాలను సేకరించడం గత ప్రభుత్వం చేసిన తప్పని పవన్.. ఇప్పుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన ప్రకటనలో పవన్ ఇంకా ఏమన్నారంటే..

‘‘ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అభిప్రాయపడుతోంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, చత్తీస్ గఢ్ రాజధాని రాయఘడ్ ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారు. అమరావతిని కూడా అంతే విస్తీర్ణంలో నిర్మించాలని అనేకమంది నిపుణులు చెప్పిన మాటలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 33 వేల ఎకరాలను సమీకరించింది. కొత్త రాజధానిగా ఆవిర్భవిస్తున్న అమరావతిని అద్భుతమైన రీతిలో నిర్మించడానికి 33 వేల ఎకరాలు కావలసిందేనని నాటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్ రెడ్డి గారు శాసనసభలో చాల గట్టిగా మాట్లాడారు. ఈ మెగా రాజధానిని తరువాత వచ్చే ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది కేవలం జనసేన మాత్రమే. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పినది కూడా జనసేన పార్టీ మాత్రమే. మూడు పంటలు పండే సారవంతమైన భూములలో భవంతుల నిర్మాణం అనర్ధదాయకమని చెప్పినది కూడా జనసేన పార్టీనే. కేవలం మూడున్నర వేల ఎకరాలకు రాజధానిని పరిమితం చేసి, ఆపై రాజధాని సహజసిద్ధ విస్తృతికి అవకాశం కల్పిచి ఉన్నట్లయితే ఇప్పుడు రైతులు కన్నీరు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేది కాదు. పెద్దలు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు గారు చెప్పినట్లు గత ప్రభుత్వం నేల విడిచి సాము చేసింది. దానికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్.ఆర్.సి.పి. వంత పాడింది. రెండు బిల్లులు గవర్నర్ గారి ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తాము. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టిపెడతాం. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం రోజుకు పది వేల కోవిడ్ కేసులు నమోదు అవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో వున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై కాకుండా కోవిడ్ నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి కేంద్రీకృతం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content