మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కంచికి చేరింది. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర్నుంచి పట్టుబట్టి అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో వడివడిగా అడుగులు వేసిన జగన్ సర్కారు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఏం చేస్తుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రాజధాని అమరావతి నుంచి తరలిపోతున్నట్లే. నామమాత్రంగా శాసన వ్యవస్థను మాత్రమే అమరావతిలో కొనసాగించబోతున్నారు. అమరావతిని ఏరికోరి రాజధానిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పడని వ్యవహారమే. దీనిపై ఆ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనే బీటెక్ రవి.
మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీటెక్ రవి లేఖ రాశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. చట్ట సభ అయిన శాసనమండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెందిన తాను అలాంటి ప్రాధాన్యత లేని సభలో ఉండడం అనవసరంగా భావించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి ఛైర్మన్‌కు ఫార్మాట్ ప్రకారం రాజీనామాను పంపనున్నట్లు రవి వెల్లడించారు. మరి రవి రాజీనామా లేఖపై చంద్రబాబు ఏమంటారో.. మండలి ఛైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదిస్తారో లేదో చూడాలి.