ఇండియాలో కరోనా కేసులు వందకు చేరువగా ఉన్న సమయంలో పాకిస్థాన్లో ఆ కేసులు 20 లోపే ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఇండియాలో కరోనా కేసులు 600 దాటగా.. పాకిస్థాన్లో రెట్టింపు సంఖ్యలో కరోనా బాధితులుండటం గమనార్హం. దీన్ని బట్టి పాకిస్థాన్లో ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే.
భారత్లోనే జనాలు ప్రభుత్వ సూచనల్ని ఆశించిన స్థాయిలో పాటించట్లేదు. నిర్లక్ష్య వైఖరితో కేసులు పెరిగేందుకు కారణమవుతున్నారు. ఇక పాకిస్థాన్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. అక్కడి జనాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక కేసు ఉదాహరణ.
రావల్పిండికి చెందిన ఓ వ్యక్తికి రెండు వారాల కిందట కరోనా సోకింది. అతణ్ని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించారు. అతను కోలుకున్నాడు. తర్వాత కరోనా టెస్టు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఇంటికి పంపించేశారు. ఐతే కరోనా నుంచి తాను కోలుకోవడాన్ని పెద్ద విజయంగా భావించిన ఆ వ్యక్తి 100 మంది స్నేహితులు, బంధువుల్ని పిలిచి పార్టీ ఇచ్చాడు.
ఐతే అందులో ఒక వ్యక్తికి కరోనా ఉండటం.. అతడితో ఈ వ్యక్తి సన్నిహితంగా మెలగడంతో మళ్లీ కరోనా సోకింది. ఆ ఇద్దరినీ మళ్లీ వైద్యుల పర్యవేక్షణలోకి పంపించారు. కోలుకున్నాక ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలని పోలీసులు భావిస్తున్నారట.
ఈ సంక్షోభ సమయంలో అతడికి పార్టీ ఇవ్వడానికి వనరులు ఎలా సమకూరాయి.. ఇతడికి బుద్ధి లేకపోయినా కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి పార్టీ ఇస్తే రావడానికి ఆ వంద మందికి ఎలా మనసొప్పింది అన్నది అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో కరోనా కేసుల సంఖ్య 1230 దాకా ఉండగా.. పది మంది దాకా ప్రాణాలు వదిలారు.