ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతలు స్పందిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమరావతిలో రైతుల ఉద్యమానికి 1200 రోజులు పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ నుంచి కీలక నేత.. సత్యకుమార్ హాజరయ్యారు. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని పూర్తి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వైసీపీ అమరావతిని నాశనం చేసిందన్నారు. అయితే.. ఇన్ని అంటున్న సత్య కుమార్ అసలు ఇన్ని రోజులు ఏం చేశారు? అనేది రైతుల ప్రశ్న.
ఎందుకంటే.. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు.. కనుసైగ చేస్తే.. జగన్ అమరావతిని నిర్మిస్తారని చెబుతున్న బీజేపీ నేతలు.. ఇప్పటి వరకు ఎందుకు కనుసైగ చేయలేక పోయారు? ఇన్నాళ్లు వారికి ఎందుకు ఫట్టలేదు? అనే ప్రశ్నలకు వారుసమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు.. ఇప్పటికిప్పుడు అమరావతి ముసుగు ధరించినంత మాత్రాన బీజేపీ నైజాన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరన్న రైతుల మాటలకు కూడా వారు సమాధానం చెప్పాలి. అనేక రోజుల పాటు రైతులు ఉద్యమం చేశారు.
కానీ, ఒక్కరోజు కూడా..(అమిత్ షా చెప్పేవరకు) బీజేపీ నేతలు మద్దతు పలకలేదు. అప్పట్లో బీజేపీ చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనా రాయణ.. అమరావతికి మద్దతు పలికారనే గుస్సాతో ఆయనపై తీవ్ర విమర్శలు చేయించారు. తర్వాత.. షా చెప్పారని సరిదిద్దు కున్నా.. కేంద్రం దగ్గరకు రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యతను మాత్రం మరిచిపోయారు. పోనీ.. రాష్ట్ర స్థాయిలో అయినా.. బీజేపీ నేతలు.. ఈ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఏదో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ముందుకు వచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన మోడీతోనే ఒక ప్రకటన చేయిస్తే.. బీజేపీని నమ్మే అవకాశం ఉంటుం ది. అలాంటి పని ఇప్పటి వరకు చేయకపోగా.. కనీసం.. ఇప్పుడు కూడా.. తాము అధికారంలోకి వచ్చాక చూస్తాం.. చేస్తాం అని నమ్మించే ప్రయత్నం చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మరో ఏడాదిపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ఏపీలోనూ వైసీపీ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీని ఒప్పించి.. లేదా..కేంద్రమే పూనుకొని ఈ నిర్మాణాలు పూర్తి చేయొచ్చుకదా? అనేది ప్రశ్న. ఇవేవీ చేయకుండా.. ముసుగు దొంగల్లా వ్యవహరించడం వల్ల బీజేపీ మరింత నాశనం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.