షర్మిల ట్విస్టు.. రేవంత్, బండిలకు ఫోన్

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎవరికి వారు తమదైన రాజకీయ ఎత్తుల్లో మునిగిపోయారు. ఇప్పటికే వేడుక్కిన రాజకీయాలకు కొనసాగింపుగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వైసీపీ అధినేత్రి షర్మిల కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె స్వయంగా ఫోన్ చేశారు.

ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని సూచన చేశారు. నిరుద్యోగ సమస్యపై కలిసి పని చేద్దామని ఆమె కోరారు. నిరుద్యోగ సమస్యలు.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రగతిభవన్ కు మార్చ్ నిర్వహిద్దామన్న ఆమె వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త కాక రేపేలా మారాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్న వైఎస్ షర్మిల.. పేపర్ లీకేజ్ అంశంపై కలిసి పోరాడదామని కోరారు. కలిసి పోరాటం చేయకపోతే.. ప్రతిపక్షాల్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ బతకనివ్వరన్న షర్మిల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షర్మిల చేసిన ప్రతిపాదనకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని బండి స్పస్టం చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇందులో భాగంగా త్వరలోనే సమావేశం అవుదామన్న బండి.. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరుకు తాము పూర్తి మద్దతు పలుకుతామని బండి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. . ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా పేర్కొన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని రేవంత్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఒకవేళ.. విపక్షాల్ని ఒక తాటి మీద తెచ్చి..ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయగలిగితే మాత్రం.. ఆ క్రెడిట్ షర్మిలకు దక్కుతుందని చెప్పక తప్పదు.