పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీని జెడ్ స్పీడులో లోక్ సభ సచివాలయం అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్ల పాటు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఉద్యమించాయి.
పార్లమెంట్ కు నల్లదుస్తులతో వస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తొందరపడిందని చెబుతున్నా వినిపించుకునేందుకు సిద్ధంగా లేరు. అనర్హత వేటుకు సంబంధించిన ఇప్పుడు మరో ఎంపీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఒక కేసులో లక్షదీవుల ఎంపీ ఫైజల్ కు శిక్షపడటంతో లోక్ సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది.
పైగా దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఫైజల్ కు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా కూడా అనర్హతను ఉపసంహరించుకోలేదు. ఆయన లోక్ సభకు రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.
ఆయన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనితో లోక్ సభ సచివాలయం దిగివచ్చింది. ఫైజల్ అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఫైజల్ కేసు లాంటిదే రాహుల్ కేసు కూడా కావడంతో ఆయన అనర్హతను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదీ రాహుల్ హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఉపసంహరిస్తారా… లేక ముందే ఉపసంహరిస్తారో చూడాలి.