పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్‌గా తన అభిమానులను అలరించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన రాజకీయాలు కాస్త పక్కన పెట్టి వరుసగా తన కొత్త కొత్త సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటిదాకా ఎన్నడూ ఇవ్వనంత బల్క్ డేట్లు ఇచ్చి ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్.. మూడు వారాల పాటు విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొని ‘వినోదియ సిత్తం’ రీమేక్‌లో తన పని అవగొట్టేశాడు.
త్వరలోనే హరీష్ శంకర్ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఆ తర్వాత సుజీత్ సినిమా షూట్ కోసం రంగం సిద్ధమవుతోంది. ఐతే పవన్ సినీ అభిమానులకు ఆయన ఇంత యాక్టివ్‌గా షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగానే ఉన్నా రాజకీయ అభిమానులకు మాత్రం ఇది రుచించడం లేదు. ఆయన జనసేనానిగా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారు.
పవన్ నుంచి వీలైనంతగా డేట్లు రాబట్టుకుని తమ సినిమాలను పూర్తి చేయించుకోవాలనే తాపత్రయం నిర్మాతలది. ఏళ్లకు ఏళ్లు ఆయన కోసం ఎదురు చూసిన వాళ్లు ఇలా తపన పడటం తప్పేమీ కాదు. కానీ పవన్ కొంచెం కష్టపడితే ఈసారి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆయన ఎన్నికలకు నెలల గడువే మిగిలున్న నేపథ్యంలో ఇక సినిమాల పరంగా జోరు తగ్గించి రాజకీయ సభలు, రోడ్ షోలు, సమావేశాలపై దృష్టిసారించాలని.. ఎన్నికల దిశగా దృష్టిసారించాలని పార్టీ వాళ్లే బలంగా అభిప్రాయపడుతున్నారు.
తన ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండొచ్చని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌కు గట్టిగా ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్నట్లు. ఈలోపు ఆయన చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తన సినిమాల మేకర్స్ ఇబ్బంది పడ్డా సరే.. పవన్ షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates