ఏపీలో సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినా.. పరదాలు కడుతున్నారని.. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఎక్కడ పర్యటన పెట్టుకున్నా.. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో పరదాలు కడుతున్నారు. అదేసమయంలో రోడ్లపై చెట్లు నరికేస్తు న్నారు. ఈ చర్యలపై ప్రజాస్వామ్య వాదులు.. ప్రతిపక్ష నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే..ఇప్పుడు ఏకంగా మురికి వాడలకు కూడా..భారీ ఎత్తున పరదాలు కట్టేస్తున్నారు. అది కూడా ఏపీ పాలనా రాజధానిగా వైసీపీ పేర్కొంటున్న విశాఖలోనే కావడం గమనార్హం. మరి దీనికి రీజనేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. విశాఖ వేదికగా జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు రూ.120 కోట్లతో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్ అలంకరణ పనులు చేపట్టారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలను మాత్రం సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కంటపడకుండా అధికారులు పరదాలు కట్టడం చర్చనీయాంశమైంది. విదేశీ ప్రతినిధులు ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వచ్చే సమయంలో, తిరిగి వెళ్లేప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోని మురికివాడలు.. వారి కంటపడకుండా ఇళ్లకు ముందు పరదాలను క ట్టేస్తున్నారు.
వివిధ దేశాలకు చెందిన 63 మంది ప్రతినిధులను ఆహ్వానించగా.. వారిలో 57 మంది హాజరవుతున్నారు. ‘రేపటి నగరాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి?’ అనే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. పట్టణీకరణలో సాధించిన విజయాలను వివిధ దేశాల ప్రతినిధులు వివరిస్తారు. మరి ఇలాంటి కీలక చర్చలో భాగం కావాల్సిన మురికి వాడలకు ఇప్పుడు పరదాలు కట్టడం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates