మేకపాటి చంద్రశేఖరరెడ్డి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వేయాల్సిన ఓటును క్రాస్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సంచలనంగా మారారు. తాజాగాఈయనపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ కొరడా ఝళిపించింది. అయితే.. దీనికి కొద్దిసేపటికి ముందు మేకపాటి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మారకపోతే.. పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు.
వైసీపీ అధిష్టానం తీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉదయగిరి వైసీపీలో 4 వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌కే పేరు వస్తుందని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, తమకు ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు.
రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని… తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్ర సమస్యల్లో పడుతుందని మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం చెప్పిన జయమంగళ వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానన్నారు.
‘టిక్కెట్టు ఇస్తే గెలిచి చూపిస్తా… ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా’… అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో తానంటే గిట్టని వాళ్లు తనపై దుష్ప్రచారం చేసి, మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. మొత్తానికి మేకపాటి వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates