ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి పాలైన వైసీపీ నేత కోలా గురువులను రాజకీయాల్లో దురదృష్టం వెంటాడుతోంది. విశాఖపట్నాన్ని రాజధాని చేసి, తాను కూడా అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ చెప్తున్నా అక్కడి బలహీనవర్గాల నాయకుడికి మాత్రం న్యాయం చేయలేకపోయారు. 151 మంది సొంత పార్టీ ఎమ్మల్యేలు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన మరో అయిదుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 156 మంది బలగం ఉన్నప్పటికీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, మత్స్యకార నేత కోలా గురువులును ఎమ్మెల్సీగా గెలిపించలేకపోయారు జగన్.
విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన నేత అయిన కోలా గురువులు మర పడవలు, హేచరీస్ వ్యాపారం చేస్తుంటారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో పేరున్న వ్యక్తి. 2009లో ప్రజారాజ్యం తరఫున విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోటీ చేసి కేవలం 341 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలవడంతో గురువులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వగా పోటీ చేశారు. అప్పటి టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2019 ఎన్నికలకు వచ్చేసరికి ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీలో చేరడంతో కోలా గురువులకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోవడంతో మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఆయన అసెంబ్లీలో అడుగుపెడతారాని అనుచరులు ఆశించారు. కానీ… ఆయనకు ఓటేయడానికి కేటాయించిన 22 మంది ఎమ్మెల్యేలలో కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉండడంతో వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో గురువులు ఓడిపోయారు.
వైసీపీ ఎమ్మెల్మేలలో ఇద్దరు ముగ్గురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని తెలిసి కూడా వారిని గురువులుకు ఓటేయాల్సిన లిస్టులో ఉంచడం… గురువులను తేలిగ్గా తీసుకోవడమేనని ఆయన అనుచరులు అంటున్నారు. గురువులను ఎలాగైనా గెలిపించుకోవాలని జగన్ అనుకుంటే పక్కాగా ఓటు వేసేవారిని ఆయన లిస్టులో ఉంచేవారని.. మత్స్యకార నాయకుడంటే, ఉత్తరాంధ్ర నాయకుడంటే చిన్నచూపు చూశారని గురువులు వర్గం నుంచి అసంతృప్తి వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates