కాంగ్రెస్ ముఖ్య నేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ
ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్నట్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్. హెచ్ వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు.
అయితే.. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టులోనే ఉన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది బాబు మంగూకియా వాదనలు వినిపించారు. ఇదిలావుంటే.. తీర్పు వెలువడిన కొద్ది సేపటికే రాహుల్ తరఫు న్యాయవాది అదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
ఏం జరిగింది?
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్ పక్షాన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.
కేంద్రం రియాక్షన్ ఇదీ..
ఇక, ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీకి బాగుంటాయేమో కానీ… దేశానికి ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కారణంగా పార్టీ పరువు పోతోందని కొందరు సభ్యులు తనకు చెప్పినట్టు మంత్రి తెలిపారు.