గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తల బొప్పి కట్టడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని కహానీలు చెప్తున్నా జగన్‌కు మాత్రం పరిస్థితులు అర్థమయ్యాయట. దిద్దుబాటు చర్యలు చేపడితే తప్ప నెగ్గుకు రాలేమన్న సత్యం బోధపడి అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారట. ఆ క్రమంలోనే యువత, ఉద్యోగులు, టీచర్లను బుజ్జగించడానికి, ఆకట్టుకోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్వేషించాలని ఇప్పటికే తన కోర్ టీమ్‌కు సూచించినట్లు సమాచారం.
మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టబోయిన వైనం స్వయంగా చూసిన తరువాత జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అలా అని తాను గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఖర్చు లేని ప్రయోజనాలు అందించాలని జగన్ తలపోస్తున్నారట.
ఆ క్రమంలోనే మొదటి అడుగుగా మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ నిబంధనలు సడలించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మహిళా ఉద్యోగులు తమ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే లోగా ఈ చైల్డ్ కేర్ లీవ్ ఉపయోగించుకోవాల్సి ఉండేది. పిల్లల వయసు 18 దాటితే ఆ సెలవు ఉపయోగించే వీలుండేది కాదు. ఇప్పుడు జగన్ దాన్ని సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునేలా జీవో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అయితే, ఉపాధ్యాయకులు కోరుతున్నట్లు సీపీఎస్ రద్దు వంటి హామీల అమలుకు జగన్‌కు ఇప్పుడు అవకాశం లేదు. నిరుద్యోగులకు భృతి ఇచ్చే పరిస్థితీ లేదు. కానీ… ఇంతకాలం.. బయోమెట్రిక్ హాజరు.. ఫేస్ రికగ్నైజేషన్ వంటి వాటితో నిబంధనలు గట్టిగా అమలు చేయడంతో ఉపాధ్యాయులకు జగన్‌పై అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాలను, ఇతర ఉద్యోగ వర్గాలనూ ఎన్నికల వరకు స్వేచ్ఛగా వదిలేయాలని అధికారులకు సీఎంఓ నుంచి సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో సాఫ్ట్ కార్నర్ సంపాదించకపోతే వచ్చే ఎన్నికలలో దెబ్బయిపోతామని గ్రహించడంతోనే వ్యూహం మార్చుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ వర్గాలకు అన్ని వైపులా బిగించి దారికి తెచ్చుకోవడం సాధ్యం కాదని.. అది తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరూపణ అయిందని.. కాబట్టి వ్యూహం మార్చాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates