బాబు నోటి నుంచి 1984 సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీలో దాడి జరిగిన ఉదంతంపై పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. గతంలో ఎప్పుడు.. ఎలాంటి సందర్భంలోనూ ఆయన నోటి నుంచి బయటకు రాని 1984 ఆగస్టు సంక్షోభం ప్రస్తావన తాజాగా బయటకు వచ్చింది. తమ ఎమ్మెల్యేలపై నిండు సభలో దాడి చేయటమే కాదు.. అనంతరం సిగ్గు లేకుండా సభ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తన తమ్ముడు ఎమ్మెల్యే స్వామిపై దెబ్బ పడకుండా చూడలేకపోయిన వైనాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ. .ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ విపక్ష సభ్యుల్ని కొట్టించాలన్న ఆలోచన రాలేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కొట్టి కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదన్న ఆయన.. పైగా సస్పెండ్ చేశారన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని అరుదైన ఉదంతాల్ని గుర్తు చేసుకొని.. వాటిని ప్రస్తావిస్తూ అప్పట్లోనూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. “1984 ఆగస్టు సంక్షోభం తర్వాత.. ఎన్టీఆర్ అసెంబ్లీకి బలపరీక్షకు వెళ్లినప్పుడు ఇలాంటి ఘోరం చూడలేదు. రాష్ట్ర విభజన వేళలోనూ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అసెంబ్లీకి విభజన బిల్లు పంపి.. చర్చించి ఓటు వేయాలన్నారు. అప్పుడు కూడా సభ్యులు కొట్టుకోలేదు. పరిటాల రవిని చంపినప్పుడు 16 రోజులు.. ఎల్లంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుపై 19 రోజులు చర్చ జరిగింది. ఇన్నో అవిశ్వాస తీర్మానాలు పెట్టాం. హోరాహోరీగా పోరాడామే కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు లేవు” అని పేర్కొన్నారు.

ఆవేశంలో అసెంబ్లీలో కొన్ని ఘటనలు జరగొచ్చని.. అలాంటి వేళ.. పెద్దలంతా కూర్చొని.. ఇలాంటి తప్పులు చేయకూడదని సర్ది చెబుతారని.. తప్పు చేసిన వారు విచారం వ్యక్తం చేస్తారన్నారు. కానీ.. అందుకు భిన్నంగా వైసీపీ సభ్యులు మాత్రం ఆ సంస్కారాన్ని ప్రదర్శించలేదని.. సభ గౌరవాన్ని మంట కలిపిన సైకో జగన్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. స్వామీ ఈ రోజు జరిగిన విషయాల గురించి మీరు బాధ పడొద్దన్నారు. “మీ త్యాగం ఊరికే పోదు. విలన్లుగా వచ్చి మిమ్మల్ని కొట్టిన వారు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసే బాధ్యత ప్రజలది.. అందుకోసం టీడీపీ ప్రతి కార్యకర్తగా పని చేస్తారు” అని మండి పడటం గమనార్హం.