ఖమ్మం బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. నేతలు బహిరంగ విమర్శలకే దిగుతున్నారు. ఒక పక్క రెబెల్ స్టార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరం జరుగుతుంటే.. ఇతర నేతలు కూడా ఐకమత్యం లేక ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా తయారయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక చోట మాత్రమే గెలిచింది. ఖమ్మంలో విజయం సాధించిన పువ్వాడ అజయ్ కుమార్ , రవాణా మంత్రిగా సేవలందిస్తున్నారు. జిల్లాలో ఆయన ఏకపక్ష ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఆయన తీరు కూడా బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది…
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇప్పుడు పువ్వాడ తీరుపై బహిరంగ అసంతృప్తిని వ్యక్తపరిచారు. నేరుగా పేరు చెప్పకపోయినా తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదంటూ ఆవేదన చెందారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో నామా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపాయి.
పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదని నామా నాగేశ్వరరావు చెప్పుకున్నారు. ఎక్కడికి పిలిచినా వస్తానని తెలిసి కూడా ఎందుకు ఆహ్వానిచడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తనను కూడా భాగస్వామిని చేయాలని నామా స్థానిక నేతలను వేడుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. పైగా ఎక్కడ గ్యాప్ వచ్చిందో చెబితే.. అందులో తన తప్పు ఉంటే సరిదిద్దుకుంటానని నామా ప్రకటించారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ మూడో సారి కేసీఆర్ ను గెలిపించుకుందామని నామా హితవు పలికారు. మరి ఖమ్మం బీఆర్ఎస్ నేతలు అందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి..
Gulte Telugu Telugu Political and Movie News Updates