వాపును బలుపుగా అనుకుని జగన్ బొక్కబోర్లా పడ్డారు. సాధారణంగా ఎక్కడైనా గెలిస్తే భారీ విజయమంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి భారీ పరాజయమని చెప్పుకోవాలి. మూడింటికి మూడు ఓడిపోవడమంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అదీ జగన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. లేని పక్షంలో ఎంత ఖర్చు చేసిన ఫర్వాలేదు… మునుగోడు తరహాలో విజయం సాధించాలని ఆదేశించి ఉండే వారు..
పెత్తందార్లే సమస్య
ప్రస్తుతం వైసీపీలో పెత్తందార్లు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. పని చేసే వారి కంటే కూర్చుని పని చేయించాలనుకునే వారే ఎక్కువగా ఉంటడంతో క్షేత్ర స్థాయిలోకి ఎవరూ వెళ్లడం లేదని తేలిపోయింది. కార్యకర్తలతో కనెక్షన్ కట్ అయిపోయింది. ముందే కింది స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. జగన్ ఛరిస్మా మీద గెలిచిన ఎన్నికలనే ప్రాతిపదికగా తీసుకుని నేతలు పెత్తనాలు చేస్తూ వచ్చారు. కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు కావాల్సిందేమిటో, కొత్తగా కార్యకర్తలను చేర్చుకునేందుకు చేయాల్సిందేమిటో ఆలోచించనే లేదు. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం మూట గట్టుకుంది..
జాగ్రత్త పడే అవకాశం…
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలిందనుకోవాలి. ఈ పరాజయాన్ని ఒక హెచ్చరికగా తీసుకునే అవకాశం, సమయమూ కలిగిందనుకోవాలి. పార్టీ బలాలు, బలహీనతలు లెక్కలేసుకుని అన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ప్రయత్నించే వెసులుబాటును వైసీపీకి ఈ ఎన్నికలు కలిగించాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులు సరిదిద్దుకునే అవకాశమూ ఈ ఎన్నికలు కల్పించాయి. పాపులిస్టు పథకాలు గెలిపించలేవని మరో సారి నిరూపితమైనందున విశాల జనహితానికి అవసరమైన కార్యక్రమాలు ఇప్పటికైనా చేపట్టాలి. రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచారన్న సంగతి గుర్తించి ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఇకనైనా చల్లబరిచేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో పరువైనా దక్కుతుంది.
ఏదేమైనా బంతి జగన్ కోర్టులో ఉంది. దాన్ని ఎటు కొడతారో ఆయన ఇష్టం. లేకపోతే అంతా కష్టం..
Gulte Telugu Telugu Political and Movie News Updates