టీడీపీ గెలుపులో పవన్ పాత్రెంత ?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానాన్ని టీడీపీ గెలుచుకోవటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రుందనే ప్రచారం మొదలైంది. ఎన్నికలు జరిగిన మిగిలిన స్ధానాలసంగతి పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుపులో మాత్రం పవన్ పాత్రుందని అర్ధమైపోతోంది. మామూలుగా అయితే జనసేన, పవన్ అభిమానుల ఓట్లు మిత్రపక్షం బీజేపీకి పడాలి. కానీ పవన్ పిలుపువల్ల ఆ ఓట్లలో ఎక్కువశాతం టీడీపీకి పడ్డాయనే ప్రచారం పెరిగిపోతోంది.

ఎందుకంటే ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని పవన్ పిలుపిచ్చారే కానీ మిత్రపక్షం బీజేపీకి ఓట్లేయమని ఎక్కడా చెప్పలేదు. బీజేపీ గెలుస్తామని బాగా ఆశలుపెట్టుకున్నది ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానంలో మాత్రమే. ఎందుకంటే బీజేపీ నేత మాధవ్ ఇక్కడి నుండి ఎంఎల్సీగా ఉన్నారు కాబట్టి. నిజానికి అప్పట్లో మాధవ్ గెలిచారంటే టీడీపీ కారణంగానే. ఇపుడు జనసేన మిత్రపక్షంగా ఉన్నా కూడా ఎలాంటి సహకారం అందలేదని సమాచారం. చివరకు మాధవ్ కు డిపాజిట్ కూడా దక్కలేదు.

ఉత్తరాంధ్రలో పార్టీ బాగా బలం పుంజుకున్నట్లు జనసేన పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా పార్టీ జెండాలు ఎగరేశారు. అందుకనే పవన్ కూడా వ్యూహాత్మకంగానే ఉత్తరాంధ్రపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఇలాంటి పరిస్ధితుల్లో పవన్ గనుక బీజేపీకి ఓట్లేయమని చెప్పుంటే కచ్చితంగా జనసేన, పవన్ అభిమానుల ఓట్లు పడుండేవే. అయితే అప్పుడు ఓట్లు బీజేపీ, టీడీపీ మధ్య చీలిపోయి వైసీపీ లాభపడుండేది. బలమైన చిరంజీవికి మద్దతిస్తే వైసీపీని ఓడించచ్చని పవన్ కు అర్ధమైందట.

బహుశా ఈ విషయాన్ని పవన్ అంచనా వేసే తన ఓట్లన్నింటినీ బీజేపీకి కాకుండా టీడీపీకి వేయించుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి బీజేపీకి ఇక్కడ పెద్దగా బలంలేదనే చెప్పాలి. గెలిచినపుడల్లా ఏదో ఒక పార్టీ మద్దతుతోనే గెలుస్తోంది. ఇక్కడ జనసేన మద్దతు వల్ల గెలుపు ఖాయమని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బాగా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని పవన్ దెబ్బకొట్టేశారు. బహుశా ఈ విషయమై రెండుపార్టీల మధ్య గట్టిగా చర్చ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు బీజేపీ ప్రశ్నలకు పవన్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.