బాబు ట్రాక్టర్లను మరిచిపోయారు.. జగన్ అంబులెన్సులు గుర్తుంటాయా?

ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అధికారంలోకి వచ్చేందుకు ఆయా సంక్షేమ పథకాలు చాలావరకు ఉపయోగపడుతుంటాయి. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలు మనసులకు హత్తుకునేలా ఉంటాయి. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం, వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం, చంద్రబాబుకు అన్న క్యాంటీన్లు…వంటి పథకాలు జనానినికి సెంటిమెంట్ గా మారాయి. అయితే, కొన్ని పథకాలకు తగినంత ఆదరణ రాదు. చంద్రబాబు హయాంలో రైతులకు 20 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు అందించే రైతు రథంపథకం కూడా ఈ కోవకే వస్తుంది. 6 వేల ట్రాక్టర్లతో చంద్రబాబు నాడు చేసిన రోడ్ షోకు విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ఎన్నికలకు ఏడాది ముందు చేసిన ఈ ట్రాక్టర్ షో…బాబుకు మళ్లీ అధికారం కట్టబెట్టడంలో కీలక భూమిక వహిస్తుందనుకున్నారు టీడీపీ నేతలు. అయితే, 2019 ఎన్నికలలో జనంపై ఆ పథకం పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయింది. తాజాగా, జగన్ చేసిన 1088 అంబులెన్స్ ల ర్యాలీ ఎఫెక్ట్ కూడా రైతు రథం మాదిరిగానే ఉండబోతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏప్రిల్ 27, 2018న సన్నకారు రైతుల సాగు కష్టాలు తీర్చేందుకు ‘రైతు రథం’ పథకాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ద్వారా రెండేళ్ళలో రాయితీపై 20 వేల ట్రాక్టర్లను అందించాలనే లక్ష్యంతో తొలి ఏడాది 6,000 ట్రాక్టర్లు మంజూరు చేశారు. ఆనాడు రాష్ట్రమంతటా వేలాది అన్నదాతల ముంగిళ్లు రైతు రథాలతో సందడి చేశాయి. కట్ చేస్తే… ఈ ఏడాది జులై 1ను ఏపీ సీఎం జగన్ 1088 అధునాతన వసతులు కలిగిన 108,104 వాహనాలతో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ 1088లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. మారుమూల ప్రాంతాలతోపాటు ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండేలా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా వాటిని సిద్ధం చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేసిన జగన్ సర్కార్ పై పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రశంసలు కురిపించారు.

నేడు జగన్ అంబులెన్సుల ర్యాలీ, నాడు చంద్రబాబు ట్రాక్టర్ల ర్యాలీ…ఈ రెండు ర్యాలీల వల్ల ఆయా పార్టీలకు అధికారంలో ఉండగా ఎంతోకొంత మైలేజి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎన్నికల ముందు ఏ పార్టీ హవా ఎలా ఉంది….ఎన్నికలకు ముందు ఎవరి హామీలు ఎలా ఉన్నాయన్న దానిపైనే ఆయా పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఎన్నికల ముందు ఏ నాయకుడికి ఎంత వెయిట్ ఉంది అన్నదే జనం ఆలోచించే ఏకైక పాయింట్ అనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు ఏ నాయకుడి వైపు గాలి వీస్తోంది….ఏ పార్టీ గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నాయన్న సమీకరణాలే జనం నాడిని నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి, జగన్ కు అంబులెన్సుల ర్యాలీ ఇచ్చే మైలేజీ కన్నా…రాబోయే ఎన్నికలకు ముందు జగన్ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆ పార్టీ గెలుపోటములను నిర్ణయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.