గెలవలేక వాలంటీర్ల మీద..

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీ వైసీపీకి షాకిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య దెబ్బ తగిలింది. మీతిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు డబ్బులు పంచిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్ అధికార పార్టీకి ఓటెయ్యలేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. దానితో ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పెరిగింది. స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీలు గెలిస్తే సరిపోతుందా.. పట్టభద్రులు గెలవొద్దా అని జగన్ క్లాస్ తీసుకుంటారన్న భయం నాయకుల్లో నెలకొంది.

నిజానికి ఫోకస్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర మీదే ఉంది. అక్కడ గెలిచి ఉంటే విశాఖ రాజధానికి ప్రజలు మద్దతిచ్చారని చెప్పుకునేందుకు వైసీపీ సిద్ధమైంది. తాజా ఓటమితో అధికారపార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. మరో పక్క మూడు రాజధానుల ప్రతిపాదనను ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారని అందుకే అక్కడ తమ అభ్యర్థిని గెలిపించారని టీడీపీ అంటోంది. ఇలాంటి స్టేట్ మెంట్స్ అన్ని వైసీపీకి పుండుమీద కారం చెల్లినట్లుగా తయారయ్యాయి..

ఉత్తరాంధ్ర పరాజయంపై అక్కడి మంత్రులు, ఎమ్మల్యేలు, వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. వారంతా అనధికారికంగా సమావేశమై ఓటమిపై పోస్ట్ మార్టం చేశారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంత వ్యతిరేకత రాకూడదని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యతిరేకత ఉందనుకున్నామని కానీ..ఈ స్థాయిలో ఉందని ఊహించలేదని మరో మాజీ మంత్రి విశ్లేషించారు. చివరకు తప్పంతా వాలెంటీర్ లదేనని వారి పై తోసేశారు. వాలెంటీర్ ల వ్యవస్థ కారణంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య నేరుగా సంబంధాలు తెగిపోయాయని మెజారిటీ నేతలు భావించారు. ఇది పట్టణ ప్రాంతానికే పరిమితం కాదని, రూరల్ లో ఉండే పట్టభద్రులకు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని భావించారు.

సార్వత్రిక ఎన్నికల్లో 51 శాతం ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లు , 22 లోక్‌సభ సీట్లను సంపాదించి అప్రతిహాత విజయం సాధించిన వైసిపి ప్రభుత్వం పై నాలుగు సంవత్సరాల్లోనే ప్రజల్లో ఎందుకు మొఖం మొత్తిందో ఎవరికీ అర్దం కావడం లేదని కొందరు నేతలు వాపోయారు.. విజయనగరం, శ్రీకాకుళంలో వ్యతిరేకత ఉందని, విశాఖలో అందరూ అనుకూలంగా ఉన్నారని భావించామని, కానీ, విశాఖలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమైందని ఉత్తరాంధ్రాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు స్పష్టం చేశారు. కార్యనిర్వహక రాజధాని చేస్తామన్నా , గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదని ఉత్తరాంధ్రాకు చెందిన మాజీమంత్రి ఒకరు విశ్లేషించారు. మొత్తంగా ప్రభుత్వం పై వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందనేది వారు నిర్ణయానికి వచ్చారు.

అధికార పార్టీ డబ్బు కూడా పంపిణీ చేసింది. కానీ విద్యాధికులు మాత్రం సైలెంట్ గా ఓటు వేశారు. ఈ సైలెంట్ ఓటింగే తమ కొంప ముంచిందని అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ రెండో వైపు సచివాలయంలో మంత్రులు, అధికారుల్లో ఏమాత్రం హుషారు కనిపించ లేదు. అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైనే చర్చించుకున్నారు. బ్యాలెట్ పేపర్ లు కావడంతో వాటన్నింటినీ కలిపి లెక్కించే పరిస్థితి ఉండటంతో ఏ జిల్లాలో ఎంత తేడా ఉందనేది ఎవరికీ తెలియలేదు. మొత్తంగా ఫలితం మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది. పెరిగిన పన్నులు, చార్జీలు , రాజధాని అమరావతి పీక నొక్కడం, నిరుద్యోగం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, వివిధ సామాజికవర్గాలు అధికార పార్టీకి దూరమవ్వడం , చివరకు కార్యనిర్వహక రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని ఆ భేటీలో నేతలు భావించారు. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలనుకున్నా ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్త తమను దెబ్బకొట్టిందని మాత్రం నేతలు వాపోయారు. అదీ ఓటమికి సాకు వెదుక్కున్నట్లుగా ఉందనే చెప్పాలి..