ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 4.30కి తన ఇంటి నుంచి బయలుదేరే జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు. రాత్రి 7.15కి ఆయన దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగుతారు. కాగా జగన్ దిల్లీలో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలా హఠాత్తుగా దిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం నుంచి పిలుపు రావడంతోనే ఆయన బయలుదేరినట్లు తెలుస్తోంది. పర్యటనకు సంబంధించిన వివరాలు ఏపీ ప్రభుత్వం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ వెల్లడి కానప్పటికీ రాజకీయ అంశాలపై చర్చకే వస్తున్నట్లు దిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఏపీలో ఎన్నికలు ఏడాదే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తుల విషయంలో దోబూచులాట సాగుతుండగా… అధికారిక పొత్తు లేకపోయినా బీజేపీ, వైసీపీ మధ్య మంచి సయోధ్యే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన కనుక బీజేపీకి దూరమైతే వైసీపీ, బీజేపీ కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఫార్ములా ఒకటి కేంద్రంలోని బీజేపీ మనసులో ఉందని… అటు తెలంగాణలోనూ ఈసారి తమకు సీట్లు పెరిగే అవకాశాలు ఉండడంతో.. ఏపీలో జీరోగా ఎందుకు ఉండాలన్న ఆలోచనతో వైసీపీతో కలిసి వెళ్లడంపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే జగన్‌కు పిలుపు వచ్చినట్లుగా రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. రాత్రి 8.30 గంటలకల్లా దిల్లీలోని జన్‌పథ్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రధాని మోదీతో పాటు అమిత్ షానూ కలుస్తారని సమాచారం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున జగన్ మరికొందరు మంత్రులనూ కలిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలతో భేటీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates